YCP Contractors: కూటమి పాలనలో వైసీపీ కాంట్రాక్టర్లకు రెడ్ కార్పెట్!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తయింది. “దుష్ట పాలన పోయింది.. మన ప్రభుత్వం వచ్చింది” అని సంబరపడిన టీడీపీ, జనసేన శ్రేణులకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మింగుడు పడడం లేదు. పైన ముఖ్యమంత్రి, మంత్రులు మారుతున్నా.. పాలనలో, నిధుల విడుదలలో ఇంకా గత వైసీపీ ప్రభుత్వ ఛాయలే కనిపిస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టుల వ్యవహారం, బిల్లుల చెల్లింపుల తీరు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు, సొంత పార్టీలోనే అంతర్మధనానికి దారితీస్తోంది.
అధికారం మారిన వెంటనే గత ఐదేళ్లుగా నష్టపోయిన తమకు న్యాయం జరుగుతుందని టీడీపీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్లు ఆశించారు. 2014-19 మధ్యకాలంలో పనులు చేసి, బిల్లులు రాక అప్పులపాలైన కాంట్రాక్టర్లు.. కూటమి ప్రభుత్వం రాగానే తమ బకాయిలు విడుదలవుతాయని కొండంత ఆశతో ఎదురుచూశారు. దాదాపు రూ. 500 కోట్ల మేర ఉన్న ఈ పాత బకాయిలు నేటికీ పెండింగ్లోనే ఉన్నాయి. అధికారుల చుట్టూ, సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. నిధులు లేవు అనే సమాధానమే ఎదురవుతోంది.
కానీ, ఆశ్చర్యకరంగా ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చకచకా క్లియర్ అవుతున్నాయి. తాజాగా పులివెందులకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్కు ఆర్థిక శాఖ రూ. 3.5 కోట్ల బిల్లులను ఆమోదించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే కాంట్రాక్టర్కు గతంలో ఏకంగా రూ. 30 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా, మరో వైసీపీ సానుభూతిపరుడైన కాంట్రాక్టర్కు ఏకంగా రూ. 686 కోట్ల విలువైన భారీ పనులను కట్టబెట్టడం కూటమి ప్రభుత్వంలోని డొల్లతనానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్న వైసీపీ అనుకూల అధికారుల పనా? లేక సంబంధిత శాఖల మంత్రులకు తెలిసే జరుగుతోందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వాలు మారినా యంత్రాంగం పాతదే. గత ఐదేళ్లలో వైసీపీకి కొమ్ముకాసిన కొందరు అధికారులు, ఇంకా ఆ పార్టీ నేతలకు, కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారన్న అనుమానం టీడీపీ వర్గాల్లో ఉంది. కోవర్టులు ఇంకా కీలక స్థానాల్లోనే ఉన్నారని క్యాడర్ గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. అయితే, రూ. 686 కోట్ల స్థాయి పనులు గానీ, కోట్ల రూపాయల బిల్లుల క్లియరెన్స్ గానీ కేవలం అధికారుల స్థాయిలో జరగవని, దీని వెనుక మంత్రుల ఆశీస్సులు, లేదా కమీషన్ల వ్యవహారం ఉందనే గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తమ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని సర్వశక్తులు ఒడ్డి పోరాడామని, తీరా గెలిచాక.. మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వైసీపీ వాళ్లకు మాత్రం అందలమెక్కిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసలు అధికారంలో ఉన్నది చంద్రబాబా లేక జగనా? అని టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఆర్థికపరమైన అంశం కాదు. ఇది పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు, వేధింపులు భరించి పార్టీని గెలిపించిన వారికి.. ప్రభుత్వం వచ్చాక కూడా అన్యాయమే జరుగుతుంటే, భవిష్యత్తులో పార్టీ కోసం ఎవరు పని చేస్తారనేది సీనియర్ నేతల ఆందోళన.
మొత్తానికి కూటమి పాలనలో వైసీపీ వాళ్ల హవా కొనసాగుతుండడం ప్రభుత్వంపై పడుతున్న పెద్ద మచ్చ. 2014-19 నాటి పెండింగ్ బిల్లులను పక్కనపెట్టి, వైసీపీ కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరచడం వెనుక ఉన్న మర్మం ఏమిటన్నది అధిష్టానం తేల్చాల్సిన అవసరం ఉంది. లేదంటే, అధికారం మారింది కానీ అన్యాయం మారలేదనే ముద్ర కూటమి ప్రభుత్వంపై బలంగా పడే ప్రమాదం ఉంది. తక్షణమే దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, రాబోయే రోజుల్లో సొంత పార్టీ నుంచే నిరసన సెగలు తగిలే అవకాశం లేకపోలేదు.






