Bhogapuram: ఉత్తరాంధ్ర భవితకు రెక్కలు… భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో కొత్త దశ..
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు మరో స్పష్టమైన ఉదాహరణగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నిలుస్తోంది. కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాగానే ఉత్తరాంధ్రకు కేంద్రం ఒక భారీ బహుమానం అందిస్తున్నట్టుగా రాజకీయ, వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఏడాది మొదలవుతూనే ఈ గిఫ్ట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉండటం విశేషంగా మారింది.
ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాల ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చే శక్తి భోగాపురం విమానాశ్రయానికి ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అధికారికంగా 2026 జూన్ నాటికి పూర్తవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఆరు నెలల ముందే ఒక విమానం అక్కడ ల్యాండ్ కావడం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా పూర్తిగా సిద్ధం కాకముందే విమానం దిగడం అంటే ఇది సాధారణ విషయం కాదని, పనుల వేగానికి ఇది నిదర్శనమని పలువురు అంటున్నారు.
ఈ విమానాశ్రయానికి తొలి కమర్షియల్ ఫ్లైట్ జనవరి 4న రానుంది. ఢిల్లీ (Delhi) నుంచి నేరుగా భోగాపురానికి ఎయిర్ ఇండియా (Air India) వ్యాలిడేషన్ ఫ్లైట్ బయలుదేరి అక్కడ ల్యాండ్ అవుతుంది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) ప్రయాణించనున్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో దిగిన తర్వాత రోడ్డు మార్గంలో భోగాపురం చేరాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి మధ్యంతర హాల్టులు లేకుండా నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయానికే చేరుకోవడం ఉత్తరాంధ్రకు వచ్చిన పెద్ద మార్పుగా భావిస్తున్నారు.
ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురానికి విమానం రావడం ఒక చారిత్రక ఘట్టంగా మారనుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు హాజరయ్యే అవకాశముంది. కొత్త ఏడాది మొదట్లోనే విమానం రూపంలో వచ్చిన శుభవార్త ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రపంచంతో నేరుగా అనుసంధానమవుతుందని అంచనా. పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా (Vizianagaram District)తో పాటు సమీప ప్రాంతాల అభివృద్ధికి ఇది కీలక మలుపు అవుతుందని విశ్వాసం వ్యక్తమవుతోంది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తును కొత్త దిశలో నడిపించబోతోందన్న నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తోంది.






