Zelensky: రష్యాకు చైనా ఆయుధాలు… జెలెన్ స్కీ ఆరోపణలను తోసిపుచ్చిన బీజింగ్..
రష్యా-ఉక్రెయిన్ యుద్దం ముగియాలని ప్రపంచం కోరుకుంటోంది. ఈ దశలో యూరప్ సహా పలు దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలవగా.. రష్యాకు చైనా, ఉత్తరకొరియా సహా పలుదేశాలు అండగా నిలుస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో పలు సందర్భాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.రష్యాకు చైనా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూరుస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) ఆరోపణలు చేశారు.
ఉక్రెయిన్‌పై గత మూడేళ్లుగా యుద్ధం (Ukraine Crisis) జరుగుతున్న వేళ రష్యాతో చైనా ఆర్థికంగా బలమైన సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ ప్రెస్మీట్లో మాట్లాడుతూ చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాస్కోకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చైనా సమకూరుస్తోందని ఆరోపించారు. అదే సమయంలో రష్యా భూభాగంలో ఆయుధాలు కూడా తయారు చేస్తోందన్నారు. ఇలా బీజింగ్‌పై జెలెన్స్కీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.
వీటిని చైనా తోసిపుచ్చింది. యుద్ధం ముగియాలని తాము బలంగా కోరుకుంటున్నామని, త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. దీనిపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చైనా వైఖరి స్పష్టంగా ఉందన్నారు. నిరాధార, రాజకీయ ఉద్దేశాలను వ్యతిరేకిస్తున్నామని, రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఎక్కువగా అమెరికా, పాశ్చాత్య దేశాలవేనని ఉక్రెయిన్ బహిరంగంగా చెప్పిందన్నారు. తాము ఎవరికీ మారణాయుధాలను సరఫరా చేయలేదన్నారు. యుద్ధం ముగియాలని కోరుకుంటున్నామని, కాల్పుల విరమణను ప్రోత్సహించడంతోపాటు శాంతి చర్చలకు సహకారం అందించేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు.







