Vatican city: పోప్ ఫ్రాన్సిస్ వారసులెవరు?

Pope : పీపుల్స్ పోప్‌గా ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సిస్ తనువు చాలించారు. ఈ విషయాన్ని కార్డినల్ కెవిన్ ఫార్రెల్ వాటికన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రకటించారు. దీంతో తదుపరి పోప్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది.
2025 జనవరిలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించారు. కేవలం 80 లోపు వయసు ఉన్న కార్డినల్స్ మాత్రమే పోప్ ఎంపిక రహస్య ఓటింగ్‌లో పాల్గొననున్నారు. దీంతో మొత్తం 252 కార్డినల్స్‌లో 138 మందికి మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉంది. దీనికి సంబంధించిన ఓటింగ్ సిస్టీన్ ఛాపెల్‌లో నిర్వహించనున్నారు.
ఇది పూర్తిగా రహస్య విధానంలో జరుగుతోంది. ఓటింగ్‌లో పాల్గొనే ప్రతి కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాలను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే బహిష్కరణ వేటు పడుతుంది.
రోజువారీ నాలుగు రౌండ్లు చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థికి మూడింట రెండోంతుల మెజార్టీ లభించే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 15 నుంచి 20 రోజుల సమయం పట్టొచ్చు. కాకపోతే పోప్ జాన్‌పాల్-2 ఈ విధానంలో స్వల్పమార్పు చేసినట్లు చెబుతారు. తొలిరోజు ఎన్నికలో మాత్రమే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అదే 10-12 రోజుల వరకు మెజార్టీ నెంబర్‌ను ఎవరూ సాధించలేకపోతే.. ఆ తర్వాత సాధారణ మెజార్టీ వచ్చిన పోప్‌గా వారసుడిగా ఎన్నికవుతారు.
ఇక్కడొక ఆసక్తికర అంశం ఉంది. నిర్వహించిన ఎన్నికలో ఎవరూ విజయం సాధించకపోతే.. బ్యాలెట్ పత్రాలను నల్లటి పొగను విడుదల చేసే ప్రత్యేక రసాయనాలతో కాల్చేస్తారు. అదే కనుక తెల్లటి పొగ వెలువడితే పోప్ ఎన్నికైనట్లు సంకేతం. ఇదంతా సిస్టీన్ ఛాపెల్‌లో జరుగుతుంది. బయట ఉన్న వారికి ఎన్నిక ఫలితం తెలియజేయడం కోసం ఈ విధానం వినియోగిస్తారు.
ఫ్రాన్సిస్ వారసత్వం కోసం పోటీపడుతున్న వారిలో వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పారోలిన్, యూరప్ బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎర్డో , కార్డినల్ పీటర్ టురుక్సన్ , కార్డినల్ లూయీస్ టాగ్లో, కార్డినల్ మాట్టో జూప్పీ, కార్డినల్ రేమాండ్ లియో బుర్కె పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.