KTR: విచారణకు కేటీఆర్ సహకరించకపోతే ఏం జరుగుతుంది?

ఫార్ములా ఈ-రేస్ కేసు తెలంగాణలో తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఈ రేసు నిర్వహణ వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కేసు పెట్టింది. దీనిపై ఏసీబీ (ACB) విచారణ జరుపుతోంది. మరోవైపు ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారం కావడం, విదేశాలకు నిధులు తరలి వెళ్లడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా కేసు నమోదు చేసింది. ఓ వైపు ఏసీబీ, మరోవైపు ఈడీ ఈ రేస్ కేసుపై దూకుడుగా ఉన్నాయి. అయితే ఈ కేసు చెల్లదని.. తనపై కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని కేటీఆర్ (KTR) ఆరోపిస్తున్నారు.
ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు ఆయనపై కఠిన చర్యలేవీ తీసుకోకుండా ఆదేశాలిచ్చింది. అదే సమయంలో విచారణ జరిపేందుకు ఏసీబీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ విచారణకు రావాలని కేటీఆర్ ను కోరింది ఏసీబీ. విచారణకోసం ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ అక్కడ హాజరు కాకుండా వెనుదిరిగి వచ్చేశారు. కేటీఆర్ తన లాయర్లతో కలిసి విచారణకు వెళ్లారు. అయితే లాయర్లను ఏసీబీ అనుమతించలేదు. దీంతో లాయర్లను అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతానని, లేకుండా కానంటూ వెనుదిరిగి వచ్చేశారు.
ఇవాల్టి విచారణకు కేటీఆర్ హాజరు కాకపోవడంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. మరోవైపు ఇదే కేసులో రేపు అంటే మంగళవారం ఈడీ కూడా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరవుతారా.. లేదా అనేది తెలీదు. అక్కడికి కూడా లాయర్లతో వెళ్లి అనుమతిస్తే విచారణకు హాజరు కావడం, లేకుంటే వెనుదిరిగి వస్తారని సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను జనవరి 2న, HMDA రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని జనవరి 3న ఇప్పటికే ఈడీ విచారించింది. రేపు కేటీఆర్ విచారణకు హాజరైతే వీళ్లు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
కేటీఆర్ ఈసారి కూడా విచారణకు రాకపోతే చట్టపరంగా వ్యవహరించాలని ఏసీబీ భావిస్తోంది. విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా కేటీఆర్ సహకరించట్లేదని ఏసీబీ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించే అవకాశం ఉంటుంది. విచారణకు సహకరించట్లేదు కాబట్టి ముందస్తు వెసులుబాటు రద్దు చేయాలని, అరెస్టుకు అనుమతించాలని కోరే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కేటీఆర్ అరెస్టు తప్పకపోవచ్చు. ఈలోపు ఈడీ కూడా ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. తగిన ఆధారాలు లభిస్తే కొందరిని అరెస్టు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోందని సమాచారం. కాబట్టి విచారణకు సహకరించకపోతే కేటీఆర్ ను కూడా అరెస్టు చేసేందుకు అటు ఏసీబీ, ఇటు ఈడీ కాచుకు కూర్చున్నట్టు అర్థమవుతోంది.