Brics: బ్రిక్స్ కు ట్రంప్ డాలర్ వార్నింగ్.. ఇప్పటికే చాలా ఎక్కువైందన్న బ్రెజిల్, చైనా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అధికారంలోకి వచ్చారు. దీంతో ఎక్కడికక్కడ అమెరికా ప్రాధాన్యతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.అది మిత్రదేశమా.. శత్రుదేశమా అని కాదు… బిజినెస్ , బిజినెస్సే అంటున్నారు ట్రంప్. అలాంటి ట్రంప్ దృష్టి.. బ్రిక్స్ సదస్సుపై పడింది. అంతే.. బ్రిక్స్ కు వార్నింగిచ్చేశారు. అమెరికాను నొప్పించడానికే బ్రిక్స్ ఏర్పాటైందని, డాలరును దిగజార్చడానికీ అది ప్రయత్నిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 10శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.
‘వారు ఆటలాడటానికి ప్రయత్నిస్తే నేనూ ఆడతా. ఎవరైనా బ్రిక్స్‌లో ఉంటే వారిపై 10శాతం సుంకాలు తప్పవు. అది అతి త్వరలోనే జరుగుతుంది. బ్రిక్స్ ఇప్పటికే చీలిపోయింది. ఒకరిద్దరు దానిని పట్టుకుని వేలాడుతున్నారు. నా ఉద్దేశంలో బ్రిక్స్‌తో పెద్ద ముప్పేమీ లేదు. కానీ వారు డాలరును ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఇంకో దేశం కరెన్సీని ప్రామాణికం చేయడానికి అవకాశం కలుగుతుంది. కానీ మేం దానిని కోల్పోవడానికి సిద్ధంగా లేం.
మీరు తెలివైన అధ్యక్షుడైతే దానిని ఎప్పటికీ కోల్పోరు. మేం ఒకవేళ డాలరు ప్రామాణికాన్ని కోల్పోతే అతి పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లే. అలాంటి దేశంగా మిగిలిపోవడానికి సిద్ధంగా లేం. అలాంటిది జరగనివ్వం. డాలర్ ఎప్పటికీ రారాజే. దానిని అలాగే కొనసాగిస్తాం. ఎవరైనా దీనిని సవాలు చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కానీ ఎవరూ అలా మూల్యం చెల్లించడానికి ముందుకొస్తారని అనుకోవడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే తాజాగా ట్రంప్ వ్యాఖ్యలకు చైనా, బ్రెజిల్ గట్టి కౌంటర్లు ఇచ్చాయి. ట్రంప్ టారిఫ్ వ్యాఖ్యలను ఖండించింది చైనా… దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. బ్రిక్స్ కూటమి అమెరికాతో ఘర్షణను కోరుకోవడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.ప్రతీకార టారిఫ్ ల కారణంగా ఎవరికీ ఉపయోగం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఏ దేశానికి వ్యతిరేకంగా తీసుకురాలేదని.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసమే బ్రిక్స్ కూటమి నెలకొల్పినట్లు తెలిపారు.
ట్రంప్ బెదిరింపులకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా (Luiz Inacio Lula da Silva) గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రపంచం మునుపటిలా లేదు మారిపోయింది. కాబట్టి మనకు చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగిఉన్నాయి. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే.. ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నా. ఇలాంటి అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఒకరిని ఎదుర్కోవడం కోసం బ్రిక్స్ ఎవరికీ హాని చేయదని, కానీ రాజకీయాలు చేసేందుకు మరో ఉదాహరణ ఉండాలని మాత్రమే ఈ కూటమి కోరుకుంటోందని లూలా వ్యాఖ్యానించారు.