Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
తమిళనాడు (Tamilnadu) లో అధికార పగ్గాలు చేపట్టాలని తహతహలాడుతున్న టీవీకే (TVK) కు.. కరూర్ తొక్కిసలాట ఘటన రూపంలో రాజకీయంగా గట్టి దెబ్బే తగిలింది. ముఖ్యంగా పోలీసులు విజయ్, ఆయన పార్టీయే.. తొక్కిసలాటకు కారణమని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో.. ప్రధాన అనుచరులంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు అనుచరులు కూడా భయపడుతున్న సమయం.. దీంతో విజయ్ ప్లాన్ బి తెరపైకి తెచ్చారన్న వాదనలు జోరందుకున్నాయి.అధికార డీఎంకేను ఒంటరిగా అడ్డుకోవడం కష్ట సాధ్యంగా మారడంతో.. అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు విజయ్ సిద్ధమయ్యారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత విజయ్ ఆదేశాల మేరకు క్రియాశీలక నేతలు.. అన్నాడీఎంకేతో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నాయి. కరూర్ దుర్ఘటనపై డీఎంకే తీవ్రంగా స్పందించకపోయినా ఆ ఘటనకు బాధ్యులు ఆ పార్టీయేనన్నట్లుగా విజయ్ వేలెత్తి చూపుతున్నారు.
ఈ ఘటనపై నిరాధార పరస్పర ఆరోపణలకు దిగవద్దని, సంయమనం పాటించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) చేసిన ప్రకటన్ని సైతం విజయ్ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం టీవీకేదే తప్పు అన్నట్లుగా చర్యలకు దిగింది. ఇదే సమయంలో బీజేపీ, అన్నాడీఎంకేలు విజయ్ పార్టీని సమర్థిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత, మాజీ ఎడప్పాడి పళనిస్వామి అయితే ఈ దుర్ఘటనతో విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదన్న ధోరణితో ప్రకటనలు గుప్పిస్తున్నారు.
అంతేకాకుండా విజయ్‌పై ఎలాంటి విమర్శలు చేయవద్దంటూ రెండు పార్టీల నేతలకు మౌఖిక ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ సీనియర్ నేత హెచ్. రాజా విజయ్‌కి మద్దతుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. కరూర్ దుర్ఘటనకు రోడ్‌షోలో తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టని డీఎంకే ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అని టీవీకే అధినేత విజయ్ మల్లగుల్లాలు పడుతుండగానే పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎ్‌స)ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు. ఇకపై ఎడప్పాడి పాల్గొనే సభలు ఎక్కడ జరిగినా విజయ్, ఈపీఎస్ ఫొటోలతో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తామంటూ సినీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ పరిస్థితులలో విజయ్‌ని ఎన్డీయేలో చేర్చుకోవాలని అన్నాడీఎంకే నేతలు, బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్డీయేకి, తనకు రాజకీయ ప్రత్యర్థి డీఎంకే కనుక ఉమ్మడి శత్రువైన స్టాలిన్ ఢీకొనడానికి మెగా కూటమిలో చేరటమే మంచిదని విజయ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు టీవీకే క్రియాశీలక నేతలు అన్నాడీఎంకే నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.






