TTD: తిరుమల పరకామణి కేసుపై హైకోర్టు సీరియస్..!
తిరుమల (Tirumala) శ్రీవారి పరకామణిలో (Parakamani) జరిగిన చోరీ కేసు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టు సీఐడీ (CID)ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీని లెక్కించే గుమస్తాగా పనిచేసే సి.వి.రవికుమార్ (C V Ravi Kumar) 2023 ఏప్రిల్‌లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద సుమారు 920 డాలర్లు దొరికినట్లు సమాచారం. అనేక సంవత్సరాలుగా రవికుమార్ ఇలా చోరీలకు పాల్పడుతున్నాడని, ఆ సొమ్ముతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
అయితే అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం, టీటీడీ (TTD) పాలకమండలి ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా అతనితో రాజీ కుదుర్చుకుంది. అందులో భాగంగానే రవికుమార్ తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న సుమారు రూ. 40 కోట్ల విలువైన స్థిరాస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. తీవ్రమైన నేరారోపణ ఉన్న కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. స్వామివారి సొమ్మును దోచుకున్న నిందితుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా, అతన్ని దాతగా మార్చి కేసును మూసివేయడం వెనుక అప్పటి పాలకవర్గం, అధికారులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ రాజీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ అనుమతి లేకుండానే పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్, అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని ఈఓ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. అయితే, లోక్ అదాలత్ చట్టం ప్రకారం రాజీ చేసుకునే అధికారం తనకు ఉందని సతీశ్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, లోక్ అదాలత్ రాజీని తప్పుబట్టింది. దాని ఆదేశాలను నిలిపివేసింది. కేసు దర్యాప్తును మరింత లోతుగా, సమగ్రంగా చేపట్టాలని ఆదేశిస్తూ విచారణను సీఐడీకి అప్పగించింది. డిసెంబర్ 2 నాటికి విచారణ పూర్తిచేయాలని హైకోర్టు గడువు విధించింది. అంతేకాక, ఈ లోక్ అదాలత్‌లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌కు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ బృందం ఇప్పటికే రంగంలోకి దిగి, పరకామణి, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన రికార్డులు, టీటీడీ బోర్డు తీర్మానాలు, లోక్ అదాలత్ రాజీ పత్రాలు వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం మీద శ్రీవారి పరకామణి చోరీ కేసులో దాగిన కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణకు హైకోర్టు ఆదేశాలు దారి తీయడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగనుంది.







