Smart Learning Tips: పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచే చిట్టి చిట్కాలు..
పిల్లలను చదివించడం ప్రతి తల్లిదండ్రులకీ ఒక పెద్ద పరీక్ష లాంటిది. కొన్నిసార్లు పిల్లలు ఉత్సాహంగా హోమ్‌వర్క్ (Homework) చేస్తారు, మరికొన్నిసార్లు మాత్రం అసలు దృష్టి పెట్టరు. అప్పుడు ఎంత చెప్పినా వినడం కష్టమవుతుంది. కానీ పిల్లల్లో ఆసక్తి పెంచడం, నేర్చుకోవడం పట్ల ఇష్టం కలిగించడం చాలా ముఖ్యమైంది. వాళ్లను బలవంతంగా కూర్చోబెట్టి చదివించడం (Children Education) కన్నా, వాళ్లకు నచ్చే విధంగా నేర్పించడం ఫలితం ఇస్తుంది.
మొదటగా పిల్లలకి చదువుకు సంబంధించిన టైమ్ నిర్ణయించే స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్లు ఎప్పుడు చదవాలనుకుంటున్నారో ఆ సమయానికి నేర్పించాలి. అలా చేయడం వల్ల వాళ్లలో డిసిప్లిన్ వస్తుంది. ఆటల మాదిరిగానే కష్టమైన పాఠాలను చిన్న గేమ్స్‌లా మార్చి నేర్పిస్తే పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు పజిల్స్, మైండ్ గేమ్స్ (Mind Games) లాంటివి ఉపయోగిస్తే వాళ్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
చిన్న చిన్న లక్ష్యాలను పెట్టి, వాటిని సాధించినప్పుడు ప్రశంసించడం కూడా చాలా అవసరం. ఒక చాప్టర్ పూర్తి చేసినప్పుడు స్టికర్ లేదా చిన్న గిఫ్ట్ ఇవ్వడం ద్వారా వాళ్లను ప్రోత్సహించవచ్చు. దీని వల్ల పిల్లల్లో పాజిటివ్ థింకింగ్ (Positive Thinking) పెరుగుతుంది, ఏదైనా నేర్చుకోవాలనే ఉత్సాహం వస్తుంది. వాళ్లు ఏదైనా నేర్చుకున్నప్పుడు “నువ్వు స్మార్ట్‌గా చేశావు” అని పొగడడం వాళ్ల కాన్ఫిడెన్స్ పెంచుతుంది.
అలాగే చదివించే వాతావరణం కూడా చాలా ప్రాధాన్యముంది. ఒకే చోట, ఒకే టైమ్‌లో చదవడం అలవాటు చేయాలి. ఆ టేబుల్ పైన వాళ్లకు నచ్చిన వస్తువులు ఉంచితే మరింత ఇష్టం కలుగుతుంది. చదవడం ముందు చిన్న స్నాక్ లేదా ఫేవరేట్ డ్రింక్ ఇవ్వడం వల్ల వాళ్లు రిలాక్స్ అవుతారు. పిల్లల్లో ఆసక్తి పెరగాలంటే పుస్తకం తెరవకముందే కొంచెం క్యూరియాసిటీ కలిగించాలి. “ఈరోజు ఏం నేర్చుకోబోతున్నావో తెలుసా?” లాంటి ప్రశ్నలు అడిగితే వాళ్లలో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. తల్లిదండ్రులు ఓపికతో, స్నేహపూర్వకంగా ఉంటే పిల్లలు చదువును బరువుగా కాకుండా ఒక ఆనందకరమైన విషయంగా భావిస్తారు..








