New Districts: ఏపీలో మరో 6 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం..!?
ఆంధ్రప్రదేశ్ (AP)లో పాలనా వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సౌలభ్యం లక్ష్యంగా కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్యను 32కు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు సాగితే జనవరి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచారు. లోక్సభ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని అప్పట్లో జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో భౌగోళికంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా, పలు పట్టణాలు, నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. వీటిని గమనించిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, తాము అధికారంలోకి వస్తే వీటిని సరిదిద్దుతామని ప్రకటించారు. అవసరమైన మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్విభజనై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
కేబినెట్ సబ్ కమిటీ ఇటీవలే అధ్యయనం పూర్తి చేసి, కొత్తగా 6 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 32కు చేరుకోనుంది. పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే, గిరిజన ప్రాంతాల ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పించడం, విలీన మండలాల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం కోసం అల్లూరి సీతారామ రాజు జిల్లాను విభజించి, మరొక కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల హద్దులలో మార్పులు, చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో, దీనికి అనుగుణంగా పలు నియోజకవర్గాల పరిధిలలో కూడా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
జనగణన (Census) ప్రక్రియకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, రాష్ట్రాలు తమ పరిపాలనా ప్రాంతాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు చేయదలిస్తే, డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. వచ్చే కేబినెట్ సమావేశంలో, కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై సమగ్రంగా చర్చించి, తుది ఆమోదం తెలిపే అవకాశం ఉంది. డిసెంబర్ 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి 32 జిల్లాలతో పాలన సాగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, భౌగోళిక ఇబ్బందులను గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.








