Delhi: డ్రాగన్-ఏనుగు భాయిభాయి.. ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానసర్వీసులు..!
దశాబ్దాల వైరం కరుగుతూ వస్తోంది. కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చొరబాట్లతో సమస్యలు సృష్టిస్తున్న పొరుగుదేశం చైనా (China).. నెమ్మదిగా భారత్ (India) పట్ల తన వైఖరి మార్చుకుంటోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానం, బిజినెస్ టారిఫ్ లతో చైనా వైఖరిలో మార్పు గోచరిస్తోంది. ఇక పొరుగుదేశం భారత్ తో శతృత్వం వల్ల సాధించేదేమీ లేదన్నది డ్రాగన్ కంట్రీకి అర్థమైనట్లే కనిపిస్తోంది. ఫలితంగా భారత్ తో మితృత్వానికి చేతులు చాస్తోంది.
షాంఘై కోపరేషన్ సమ్మిట్ లో భారత ప్రధాని మోడీ, చైనా అధినేత జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి సరదాగా గడిపారు. ఈసమయంలోనే ఇరుదేశాల మధ్య సమస్యలు, మనస్పర్థలు, తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.ఎప్పుడైతే మోడీ, జిన్ పింగ్ మధ్య చర్చలు జరిగాయో.. అక్కడి నుంచి చైనా విధానంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దానిలో భాగంగా ఎవరెస్ట్ అధిరోహణకు మార్గం తెరవడం, సరిహద్దుల్లో సైనికులను వెనక్కు పిలవడం సహా పలు అంశాలను సుహృద్బావ అంశాలుగా చైనా అనుసరిస్తోంది.
ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ – చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థకు చెందిన విమానం 176 మంది ప్రయాణికులతో కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి చైనాలోని గ్వాంగ్జౌ నగరానికి చేరింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, 2020 మార్చి వరకు ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిరాటంకంగా కొనసాగాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందడం, ఆ తర్వాత తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల ఫలితంగా భారత్ – చైనా మధ్య విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.
గత కొంతకాలంగా విమాన సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇరు దేశాల అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగానే, మొదటి విమానం నిన్న కోల్‌కతా నుండి చైనాకు బయలుదేరింది. ఈ సర్వీసుల పునఃప్రారంభంతో వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయాణం సులభం కానుంది.







