Vegetarian Diet: ప్రపంచ ఆరోగ్యానికీ, విలువలకీ కొత్త దారి చూపుతున్న వెజిటేరియన్ డైట్..
మనిషి ఆహారపు అలవాట్లు కాలక్రమంలో మారిపోవడం సహజం. కొంతమంది చిన్నప్పటి నుంచీ మాంసాహారం తీసుకునేవారైనా, వయస్సు పెరుగుతున్నకొద్దీ శాకాహారాన్ని అవలంబిస్తారు. అలాగే, పుట్టుకతోనే శాకాహారులుగా ఉన్న కొందరు తరువాత మాంసాహారానికి మొగ్గు చూపుతారు. ఈ మార్పులు వ్యక్తిగత ఆలోచన, జీవనశైలి, ఆరోగ్య కారణాలపై ఆధారపడి ఉంటాయి. ఆహారం ఏదైనా — శాకాహారం (Vegetarian Diet) కావచ్చు, మాంసాహారం (Non-Vegetarian Diet) కావచ్చు — అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా శాకాహారం వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది తమ జీవనశైలిలో మార్పులు చేస్తూ, ఆరోగ్యకరమైన జీవితం కోసం కూరగాయలు, పండ్లను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. వైద్యులు కూడా కొందరికి వెజిటేరియన్ డైట్ (Vegan Diet) ఆరోగ్యపరంగా మంచిదని సూచిస్తున్నారు. జంతు హక్కుల పట్ల సానుభూతి చూపించే వ్యక్తులు కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాకాహారం ఎక్కువగా అనుసరించే దేశాల గురించి మాట్లాడితే, భారతదేశం (India) అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక్కడ మొత్తం జనాభాలో దాదాపు 30 శాతం మందికి పైగా ప్రజలు కూరగాయలే తింటారు. ఇక రెండో స్థానంలో ఇజ్రాయెల్ (Israel) ఉంది. అక్కడ సుమారు 13 శాతం మంది ప్రజలు పూర్తిగా శాకాహారాన్ని అనుసరిస్తున్నారు.
మూడో స్థానంలో తైవాన్ (Taiwan) నిలుస్తుంది. అక్కడ జనాభాలో 12 శాతం మంది వెజిటేరియన్స్గా ఉన్నారు. తైవాన్లో బౌద్ధ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో, చాలా మందికి శాకాహారం జీవన విధానంలో భాగమైపోయింది. అక్కడ వెజ్ రెస్టారెంట్లు విస్తృతంగా కనిపిస్తాయి. ఇటలీ (Italy) విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇక్కడ 10 శాతం మందికి పైగా ప్రజలు శాకాహారం వైపు మారుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం, పర్యావరణానికి మద్దతు చూపడం వంటి కారణాల వల్ల ఈ మార్పు గమనించదగ్గది.
ఆస్ట్రియా (Austria) ఐదో స్థానంలో ఉంది. అక్కడ సుమారు 9 శాతం మంది ప్రజలు కూరగాయలతో కూడిన ఆహారాన్నే ఇష్టపడుతున్నారు. అక్కడి ప్రజలు ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించే వారు కావడంతో, జంతు హింసకు వ్యతిరేకంగా ఉన్న భావన కూడా శాకాహారం వైపు వారిని మళ్లిస్తోంది. మొత్తానికి ప్రపంచం నెమ్మదిగా ఆరోగ్యకరమైన జీవన పద్ధతుల వైపు అడుగులు వేస్తోంది. ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా, మన విలువలు, ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇప్పుడు శాకాహారం ప్రపంచవ్యాప్తంగా ఒక నూతన జీవనశైలిగా మారుతోంది.








