TANTEX: ఆకట్టుకున్న గజల్ పరిమళం ప్రసంగం.. టాంటెక్స్ 219 వ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ (TANTEX) సాహిత్య వేదిక ‘’నెల నెలా తెలుగువెన్నెల’’ 219 వ సాహిత్య సదస్సు 2025 అక్టోబర్ నెల 19వ తేదీ ఆదివారం నాడు డాలస్ టెక్సాస్ నగరము నందు జరిగింది. ’తెలుగు వనంలో గజల్ పరిమళం’ అంశంపై ముఖ్య అతిథులు కొరుప్రోలు మాధవరావు, శ్రీమతి విజయ లక్ష్మి కందిబండ ప్రసంగంతో పాటు రసవిహారి గజల్ గానంసాహితీ ప్రియులను విశేషంగా అలరించింది. తొలుత ప్రార్ధన గేయాన్ని చిరంజీవి సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించడంతో సదస్సు ను ప్రారంభించడం జరిగింది. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిలతో ప్రశ్నోత్తరాలుగా కార్యక్రమం నిర్వహిస్తూ మధ్యలో రసవిహారి గారిచే వాటికి అనుబందముగా ప్రసిద్ద గజల్స్ ను పాడిస్తూ దయాకర్ మాడా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
శ్రీమతి విజయలక్ష్మి కందిబండ మాట్లాడుతూ తాను ఉపాధ్యాయురాలిని కావడంతోనూ మహాకవిపోతన ,కరుణశ్రీ పద్య రచనలు తనకు ప్రాణం కావడంతోనూ సాహిత్య ప్రేమ పెరిగిందన్నారు. గజల్ లక్షణాలను ప్రస్తావిస్తూ ‘’ముట్టుకుంటే మాసిపోయేంత సుకుమారమైన పదాలు మాత్రమే గజల్ కు వన్నె తెస్తాయి. ఒకపొడుపుకథ పొడవగానే మన భృకుటి ముడిపడితుంది. కథను విప్పగానే భృకుటి ముడివిడిపోతుంది…..గజల్ కవికి ఊహాశీలతతోపాటు, చమత్కారాన్ని పండిరచడానికి కావలసిన వ్యూహనిర్మాణం కౌశలం ఉండాలి..గజల్ షేర్ వినగానే ఆశ్చర్యం , ‘’ ఒక వావ్’’,’’శభాష్ ‘’ లాంటి స్పందనలు వినేవారిలో కలగాలి.అదే గజల్ ప్రత్యేకత..’’అని అన్నారు. తన బాల్య స్నేహితుడు శ్రీ కొరుప్రోలు మాధవరావు గురువై తన చేత గజల్స్ నేర్పించి రాయించడంతో దాదాపు 1000 గజల్స్ వ్రాయడం జరిగిందన్నారు .108గజల్స్ తో ‘‘చంద్రసఖి’’పుస్తకంగా ప్రచురించబడిరదనీ .మిగిలినవన్నీ అముద్రితాలే ననీ అన్నారు.
నేటి ఈ’’తెలుగు వనంలో గజల్ పరిమళం’’ ప్రసంగాలు వీక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి.‘‘ఇంతులతో మంతనాలు’’ గా దాశరథి వారిచే స్వేచ్ఛానువాదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ యొక్క అసలు పేరు – ‘‘గజల్’’ . ఈ ప్రక్రియలో సాహిత్య సాఫల్యతనొందిన కవీశ్వరులను ‘‘షాయర్’’ లనీ, వారి పద్యఖండికలను ‘‘షాయిరీ’’ లనీ మనకు గజల్ సాంప్రదాయ సాహిత్యం యొక్క పరిభాష చెబుతుంది. అటువంటి ముగ్గురు షాయిర్ లు నేడు తమ మాటల పాటల విశ్లేషణా సౌరభాలను విరజిమ్మి సభావనంలో నిజంగానే గజల్ పూవులు పూయించారన్నది అతిశయోక్తి కానేరదు. కొరుప్రోలు మాధవరావు పాండిత్యంలో చంధస్స్వభావ స్వరూప రేఖలను దిద్దుకొని,శ్రీ రసవిహారి విశిష్ట గాన మాధుర్యంలో తీయదనాన్ని గ్రహించి, శ్రీమతి విజయలక్ష్మి స్వీయకవితా ధారలో ప్రవహించి సభాసదస్యుల మృదుహృదయాలను గాఢంగా రంజింపజేసి ఆకర్షించినది నేటి ప్రధాన వక్తల ప్రసంగం.
సాహిత్య వేదికనలంకరించిన ప్రధానవక్తల త్రిగళ భాషణా ఉధృతి , రసవిహారి గాన కళా వైభవము, విజయలక్ష్మి చేయితిరిగిన గజల్ కవనము, మాధవరావు సాహిత్య ప్రక్రియా పాండిత్యము వెరసి, ముగ్గురు వక్తల ఆయా రంగాల విస్తారకృషి, వారి వారి తాదాత్మ్యం చెంది చేసిన ప్రసంగాలలో ప్రతిఫలించింది. గజల్ పుట్టి పెరిగిన ఉర్దూ కవితలలో లేనటువంటి అనేక నూతన అంశాలను తనలో కలుపుకుంటూ పోతున్న తెలుగు గజల్ గురించి విశేషంగా నొక్కి చెప్పడం జరిగింది. కేవలం ఒక ప్రియురాలి వర్ణన, విలాస జీవన గాథల ఊసులే కాకండా కొత్తగా తెలుగు సమాజానికి, పాఠకులకూ కావలసిన సమకాలీన సామాజిక అంశాలనూ , ప్రబోధ సందేశాలను, సమస్యలను వర్ణించి అవసరమున్న చోట ప్రశ్నించే స్వభావాన్ని రేకెత్తించే అనేకానేక కవితా పద్మాలను సభలో ప్రవేశపెట్టి సభలోని వీక్షకుల పూర్తి ఏకాగ్రతను తమ వైపు రప్పించే విధంగా జరిగినవి గజల్ ప్రసంగాలు.
ప్రసంగానంతరం జరిగిన ప్రత్త్యుత్తరాల సమయంలో ఎన్నడూ లేని విధంగా సభలోని వారూ, ఆన్లైన్ లో వీక్షించిన వారందరూ పోటీ పడుతూ తమ రంజిల్లిన హృదయ స్పందనలను కవితాత్మక పదాలలో చెప్పారు అంటే ఈ ‘’తెలుగు వనంలో గజల్ పరిమళం’’ప్రసంగాలను వీక్షకులు ఎంతగా ఆదరించారో ఊహించవచ్చును. చివరి అంశంగా సాహితీప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 89 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక’’మనతెలుగుసిరిసంపదలు’’లో చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు, పొడుపు కథలు సహా దాదాపు యాభై ప్రక్రియల లోని వైవిధ్య భరితమైన తెలుగు భాషా పదసంపదను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున శ్రీ దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథులను టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ వంటి సంస్థ పూర్వ అధ్యక్షులతో పాటు సంస్థ తక్షణ పూర్వాధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సంస్థ ప్రస్తుత సమన్వయకర్త శ్రీ దయాకర్ మాడా ,శ్రీమతి స్వర్ణ అట్లూరి ,శ్రీమతి గౌతమి ,శ్రీ రాజా కాల్వ , శ్రీ శ్రీధర్ సిద్ధ ,శ్రీ గోడవర్తి నవీన్, ,శ్రీ లెనిన్ వేముల, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ దంపతులు, శ్రీ గోవర్ధనరావునిడిగంటి వంటి సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది. వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి సమన్వయ కర్త దయాకర్ మాడా సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.







