Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కాపుల కోపమెందుకు..?
కందుకూరు (Kandukur) నియోజకవర్గంలో ఇటీవల కుల చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. కాపు కులానికి చెందిన లక్ష్మీ నాయుడును (Lakshmi Naidu) కమ్మ కులానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ (Harischandra Prasad) అనే వ్యక్తి హత్య చేశాడు. ఇది రాజకీయ రంగు పులుముకుని ఉద్రిక్తతలకు దారితీసింది. కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కమ్మ కులస్తుడు హత్య చేశాడంటూ పలువురు కాపు నేతలు, కాపు కులస్తులు దీన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకుంది. దీన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకున్న వాళ్లకు చెక్ పెట్టింది.
అయినా ఇప్పటికీ కొంతమంది నేతలు ఈ అంశాన్ని లైవ్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాపు కులస్తులు కొందరు దీన్ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను బద్నాం చేసేందుకు వాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా పవన్ కల్యాణ్, కాపు వర్గాలకు ఏమీ చేయట్లేదని, ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా స్పందించట్లేదని ఆరోపిస్తున్నారు. ఆయన్ను పర్సనల్ గా టార్గెట్ చేసి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కులాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కల్యాణ్ ను కాపులకు దూరం చేయాలని ట్రై చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ ఏనాడూ ఓ వర్గాన్ని కానీ, ఓ కులాన్ని కానీ, మతాన్ని కానీ దగ్గరకు తీయలేదు. తాను అందరివాడినని చెప్పుకుంటారు. తాను కాపు కులస్తుడైనంత మాత్రాన ఆ కులాన్ని తాను వెనకేసుకు రాబోనని గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు. కాపు సంఘాలు, చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లు ఎన్నోసార్లు పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్లే పవన్ కల్యాణ్ తమ వాడని కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కల్యాణా కానీ, జనసేన కానీ ఆ ట్యాగ్ ని తగిలించుకునేందుకు ముందుకు రాలేదు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతి ప్రదర్శించారని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఉండే వాళ్లు ఓ కులానికో, మతానికో పరిమితమైతే అధికారం అంత ఈజీ కాదనే విషయం పవన్ కల్యాణ్ కు తెలుసు.
పవన్ కల్యాణ్ ఓన్ చేసుకోకపోయినా, ఆయన్ను తమవాడని భావిస్తున్న కొంతమంది కాపు నేతలు ఆయన వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నా కూడా తమకు పదవులు ఇవ్వలేదనే ఆక్రోశం కొంతమంది కాపు నేతల్లో, కాపు సంఘాల నేతల్లో ఉంది. అందుకే ఇలాంటి వాళ్లు అసంతృప్తితో ఉన్నారు. కందుకూరు ఘటనను పవన్ కల్యాణ్ పై గురి పెట్టడానికి ఇదే కారణం. దీని ద్వారా లబ్ది పొందాలని భావించారు. వీళ్ల వెనుక ఓ రాజకీయ పార్టీ హస్తం ఉందనే ప్రచారం కూడా ఉంది. కూటమిలో చిచ్చు పెట్టి, టీడీపీకి జనసేనను దూరం చేయగలిగితే తాము అధికారంలోకి రావచ్చనే కుట్రతోనే ఆ పార్టీ, కాపులను రెచ్చగొట్టిందనే సమాచారం ఉంది.







