YS Jagan: జగన్ యూటర్న్ వెనుక కారణమేంటి..?
విశాఖ గూగుల్ డేటా సెంటర్ (Vizag Google Data Center) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) యూటర్న్ (U Turn) తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు జగన్ (YS Jagan) ప్రెస్ మీట్ పెట్టేవరకూ ఆ పార్టీ నేతలు, మీడియా, సోషల్ మీడియా మొత్తం గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా కథనాలు వండి వార్చాయి. అయితే ప్రెస్ మీట్ లో జగన్ ఆ డేటా సెంటర్ కు తాము అనుకూలం అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ AI డేటా సెంటర్ తో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాన్ని ప్రకటించినప్పుడు, వైసీపీ, దాని అనుబంధ మీడియా, షల్ మీడియా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ఇదొక గోడౌన్ లాంటిదని, దీని వల్ల 200 మందికి కూడా ఉద్యోగాలు రావని ఎద్దేవా చేశాయి. ఉద్యోగాలు కల్పించని ఈ ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం 22వేల కోట్ల రాయితీలు ఇస్తోందని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలుగుతుందని ఆరోపించాయి. అంతేకాక, ఈ డేటా సెంటర్ కోసం భారీగా కరెంటు, నీళ్ళు అవసరమవుతాయని, విశాఖకు నీటి ఎద్జడి, కరెంటు కోత తప్పదని హెచ్చరించాయి. పర్యావరణపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయని విమర్శించాయి.
ఓ వైపు వైసీపీ నేతలు, తమ సొంత మీడియా, సోషలా మీడియా గూగుల్ డేటా సెంటర్ పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే వై.ఎస్.జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని అందరికీ ఆశ్చర్యం కలిగించారు. అంతేకాక, యూటర్న్ తీసుకున్న జగన్.. వ్యతిరేకతను పక్కనపెట్టి, ఈ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను ప్రస్తుత ప్రభుత్వం దక్కించుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది వాస్తవానికి తాము గతంలో శంకుస్థాపన చేసిన అదానీ గ్రూప్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు విస్తరణ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో అదానీ గ్రూప్ రూ. 87,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి, గూగుల్‌ను తమ క్లయింట్‌గా తీసుకువస్తుందని విశ్లేషించారు. అంటే, డేటా సెంటర్ నిర్మిస్తున్నది అదానీ అని, గూగుల్ అనేది దానికి ఒక ప్రధాన వినియోగదారు అని జగన్ వాదన.
జగన్ తన వాదనను బలపరుస్తూ, గూగుల్ నుండి రాష్ట్ర ఐటీ కార్యదర్శికి వచ్చిన ఒక ఈమెయిల్ లేఖను ప్రదర్శించారు. అందులో భూమి కేటాయింపు కోసం అదానీ ఎగ్జిక్యూటివ్ పేరును అధీకృత కాంటాక్ట్‌గా పేర్కొన్నట్లు చూపారు. ఇది ప్రాజెక్ట్‌లో అదానీ ప్రధాన పాత్రను నిరూపిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు పునాది తమ ప్రభుత్వ హయాంలోనే వేయబడిందని, అదానీ గ్రూప్‌కు భూమి కేటాయించడం, 2023 మే 3న శంకుస్థాపన చేయడం, సింగపూర్ నుండి సబ్-సీ కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు గూగుల్ రావడానికి మార్గం సుగమమైందని జగన్ వాదించారు. వైసీపీ, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ కృషి వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని క్రెడిట్‌ను పంచుకున్నారు.
మొదటి నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వచ్చిన వైసీపీ, చివర్లో తన స్టాండ్‌ను మార్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ పెద్ద ఎత్తున ప్రజల్లో సానుకూలతను తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. దానిని వ్యతిరేకించడం అంటే, ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించినట్లే. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుంది. అందుకే, ఆ ప్రాజెక్ట్‌ను స్వాగతిస్తూనే దాని క్రెడిట్‌ను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా దక్కించుకోకుండా, అది తమ హయాంలో మొదలైందని చెప్పుకోవడం ద్వారా రాజకీయ మైలేజీ పొందాలని భావించారు. తమ హయాంలోనే అదానీ గ్రూప్‌తో భారీ పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని, అదానీ సంస్థే ఈ డేటా సెంటర్ నిర్మాణంలో కీలకమని చెప్పడం ద్వారా, అదానీతో తమకు ఉన్న సంబంధాలను కూడా పరోక్షంగా పునరుద్ఘాటించారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలను తాము ఏనాడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేయడం ద్వారా, అంతకుముందు సొంత పార్టీ నేతలు చేసిన విమర్శలకు తెరదించారు.
మొత్తంగా, వైసీపీ నాయకులు మొదట చేసిన తీవ్ర వ్యతిరేకత కేవలం రాజకీయ విమర్శలుగానే మిగిలిపోయాయి, అయితే జగన్ ప్రెస్‌మీట్ ద్వారా ఆ ప్రాజెక్టును స్వాగతిస్తూనే.. దాని పునాది, కీలక పాత్రధారుల పేర్లను వెల్లడించడం ద్వారా క్రెడిట్ చోరీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం ఈ యూటర్న్ వెనుక ఉన్న పూర్తి రాజకీయ వ్యూహంగా భావించవచ్చు.







