Revanth Vs Chandrababu: బనకచర్లపై చర్చకు తెలంగాణ ససేమిరా..! ఢిల్లీ సమావేశానికి ముందు ఉత్కంఠ..!!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదుల జలాలపై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 16న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై (Banakacherla Project) చర్చను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. బనకచర్ల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించి, తెలంగాణ ప్రతిపాదనలను చేర్చాలని కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) వంటి నియంత్రణ సంస్థలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లభించలేదని, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (GWDT) 1980 తీర్పులను ఉల్లంఘిస్తుందని లేఖలో స్పష్టం చేశారు. బనకచర్ల చర్చను సమావేశ ఎజెండాలో చేర్చడం కేంద్ర నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని తెలంగాణ వాదించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును రాయలసీమ ప్రాంతంలో కరవు సమస్యను తీర్చే గేమ్-ఛేంజర్‌గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది వరద జలాలను కృష్ణా నదికి, అక్కడి నుంచి నంద్యాల జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు, తద్వారా పెన్నా నదికి మళ్లించాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టు తెలంగాణ హక్కులను ఏమాత్రం హరించదని, కేవలం సముద్రంలోకి వృథాగా పోయే వరద జలాలను మాత్రమే వినియోగిస్తుందని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణ ఈ వాదనను తిరస్కరిస్తూ, గోదావరి జలాల్లో సర్‌ప్లస్ నీటి వాటా నిర్ణయించబడలేదని, ఈ ప్రాజెక్టు వల్ల తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే తిరస్కరించిన విషయాన్ని ఉటంకించింది. ఈ ప్రాజెక్టు కోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఆంధ్రప్రదేశ్‌ను అడ్డుకోవాలని కేంద్ర జల సంఘాన్ని కోరింది. అంతేకాక, ఈ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, బదులుగా తెలంగాణ ప్రతిపాదించిన ఎజెండాను చేర్చాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రతిపాదనల్లో కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు రాష్ట్రంలోని కరవు ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చడానికి కీలకమని తెలంగాణ వాదిస్తోంది.
రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చను తెలంగాణ తిరస్కరించడం, ఆంధ్రప్రదేశ్ దానిని ఏకైక ఎజెండాగా పెట్టడం వల్ల చర్చలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C R Patil) సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొననున్నారు.