Putin: ఉక్రెయిన్ శాంతి చర్చల్లో పురోగతి ..?
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగింప జేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. ఓ వైపు చర్చలకు సిద్ధమని ఇరువైపులా అధ్యక్షులు చెబుతున్నారు. కానీ.. యుద్ధం మాత్రం కొనసాగూతూనే ఉంది. పుతిన్ తో సన్నిహిత బంధం కొనసాగిస్తున్న ట్రంప్(Trump).. ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ పలుదపాలుగా చర్చలు జరిపారు. అయినా ఇప్పటివరకూ సరైన పురోగతి కనిపించడం లేదు..
ఇలాంటి తరుణంలో రష్యా ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ (Ukraine )తో కొనసాగుతున్న శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు రష్యా (Russia) వర్గాలు పేర్కొన్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధాన్ని ఆపలేకపోతే.. శాంతి ప్రక్రియ నుంచి వైదొలగుతామని అమెరికా హెచ్చరించిన విషయాన్ని విలేకర్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే దానిపై వాషింగ్టన్నే ప్రశ్నించాలని సూచించారు.
‘‘సంక్షోభ పరిష్కారానికి రష్యా కట్టుబడి ఉంది. అదే సమయంలో మా ప్రయోజనాలు కాపాడుకుంటాం. దీనిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. కొంత పురోగతి సాధించామని నమ్ముతున్నాం. కొన్ని డెవలప్మెంట్లు జరిగాయి. కానీ, కొన్ని సంక్లిష్ట అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్లో యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. పశ్చిమాసియాకు ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో కలిసి ఆయన యూరప్, ఉక్రెయిన్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.







