Palastine: గాజా యుద్ధగాయాలు మానేదెలా..?
ఇజ్రాయెల్-హమాస్ పోరులో యుద్ధబాధితురాలిగా మిగిలింది గాజా. యుద్ధవిమానాల హోరు, క్షిపణీదాడులు, బాంబుల వర్షానికి సజీవ సాక్షిగా మిగిలింది. ఒకప్పుడు ప్రజా జీవితంతో సందడిగా ఉండే గాజా.. ఇప్పుడు స్మశానంలా మారిపోయింది. అయితే యుద్ధ విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.మరి గాజా ప రిస్థితి ఏంటి? అది కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? దాన్ని పునర్ నిర్మాణం చేసే బాధ్యతను ఎవరు తలకెత్తుకుంటారు…సర్వ నాశనం చేసిన ఇజ్రాయెల్(Israel), దాని మిత్రపక్షం అమెరికానా..? లేక సన్నిహిత మిత్రపక్షాలా..? ఈప్రశ్నకు బదులు కనిపించడం లేదు.
గాజా కోలుకోవాలంటే దశాబ్దాల కాలం పడుతుందని ఐక్యరాజ్యసమితి(uno) తాజాగా తేల్చి చెప్పింది. దిగ్బంధనాలు కొనసాగితే.. యుద్ధానికి ముందు ఆర్థిక పరిస్థితికి చేరడానికి గాజాకు కనీసం 350 ఏళ్లు పడుతుందని ఐరాస అంచనా వేసింది. తాజాగా వేసిన అంచనాల ప్రకారం 10 శాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని భావిస్తే.. 2050 నాటికి గత పరిస్థితికి గాజా చేరుకుంటుందని పేర్కొంది. అది కూడా మిలటరీ చర్యలు లేకుండా, సరుకుల రవాణా స్వేచ్ఛగా జరిగి, పెట్టుబడులు వచ్చి, ఏటా 2.8ుజనాభా పెరుగుదల ఉన్నపుడు మాత్రమే సాధ్యమని అభిప్రాయపడింది.
ఇక్కడి భవన శిథిలాల తొలగింపుపై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఒక అంచనా వేసింది. యుద్ధం కారణంగా పేరుకుపోయిన 50 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు కనీసం 21 ఏళ్లు పడుతుందని, 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని లెక్కగట్టింది. హింస కారణంగా గాజా అభివృద్ధి 69 ఏళ్లు వెనక్కి పోయిందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అధికారి ఒకరు చెప్పారు. 2023 అక్టోబరు 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్‌పై దాడితో గాజాలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెలీలు కన్నుమూశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఆ ప్రాంత పౌరులు 46 వేల మంది చనిపోయారు.
కూలిపోయిన ఇళ్ల పునర్మిర్మాణం ఇప్పట్లో సాధ్యపడదని గతేడాదే ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గత డిసెంబరులో యూఎన్ శాటిలైట్ డేటా ప్రకారం యుద్ధానికి ముందు ఉన్న భవనాల్లోని మూడింట రెండు వంతులు.. అంటే 1.70 లక్షలకు పైగా ధ్వంసమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 18 లక్షల మంది ప్రజలకు వెంటనే ఆవాసాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ అంచనాల ప్రకారం కనీసం 68 శాతం రోడ్డు నెట్వర్క్ నాశనమైంది. 75 శాతం పైగా నీటి పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఇక శరణార్థులు ఎక్కువగా నివసించే ఉత్తర గాజాలోని జబాలియా పట్టణం మొత్తం శిఽథిలాల కుప్పగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సగానికి పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది. 95 శాతానికి పైగా పశువులు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి.






