Modi: బిమ్స్ టెక్ మరింత బలోపేతం.. మోడీ సూచనలు
బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోడీ నొక్కిచెప్పారు. భారతీయ చెల్లింపుల వ్యవస్థ ‘యూపీఐ’తో బిమ్స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థల అనుసంధానానికి పిలుపునిచ్చారు. దానివల్ల వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటక రంగాల్లో ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. ప్రత్యేక ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఏర్పాటుచేసుకోవడం ద్వారా వాణిజ్య బంధాన్ని పటిష్ఠం చేసుకుందామనీ ప్రతిపాదించారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో.. ఆ దేశ ప్రధాని పీటోంగ్టార్న్ షినవాత్ర్ అధ్యక్షతన శుక్రవారం బిమ్స్టెక్ ఆరో శిఖరాగ్ర సదస్సు జరిగింది. అందులో ప్రసంగించిన మోడీ.. బిమ్స్టెక్ సభ్యదేశాలు పరస్పర సహకారం పెంచుకొని, కలిసికట్టుగా ముందుకు సాగేందుకు వీలుగా 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు.
బ్యాంకాక్ విజన్ 2030కి ఆమోదం
బంగాళాఖాత తీర ప్రాంతంలో భద్రత, సమ్మిళితత్వం విలసిల్లేందుకు దోహదపడేలా ‘బ్యాంకాక్ విజన్ 2030’ని సదస్సులో సభ్యదేశాలు ఆమోదించాయి. వాణిజ్య, రవాణా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని అవి తీర్మానించాయి. బిమ్స్టెక్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బంగ్లాదేశ్‌కు థాయ్‌లాండ్ అప్పగించింది.
BANGKOK: మోడీ ప్రణాళికలోని మరిన్ని కీలకాంశాలు…
మానవ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ‘బోధి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇందులో భాగంగా ఏటా బిమ్స్టెక్ దేశాలకు చెందిన 300 మంది యువతీ యువకులకు భారత్‌లో శిక్షణనిస్తారు.స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి.విపత్తు నిర్వహణలో సహకరించుకునేందుకు దోహదపడేలా భారత్‌లో ‘బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ను ఏర్పాటుచేయాలి. సముద్ర జలాల్లో సమన్వయ సాధన, పరిశోధనలకు దోహదపడేలా ఇండియాలో సుస్థిర సముద్ర రవాణా కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవాలి. నానో ఉపగ్రహాల తయారీ-ప్రయోగం, రిమోట్ సెన్సింగ్ డేటా వినియోగంపై శిక్షణనిచ్చేందుకు గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటుచేయాలి. క్యాన్సర్‌పై పోరులో బిమ్స్టెక్ దేశాలకు టాటా మెమోరియల్ సెంటర్ సహకరిస్తుంది.ఎలక్ట్రిక్ గ్రిడ్ అనుసంధానాన్ని వేగిరం చేయాలి.
బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనార్టీల భద్రతపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. వారికి తగిన రక్షణ కల్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌ను కోరారు. బ్యాంకాక్‌లో శుక్రవారం మో డీ , యూనస్ 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజీత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతుగా నిలుస్తుందని యూనస్‌తో మోడీ పేర్కొన్నారు. అక్రమ వలసలను నివారించేందుకు ఇరు దేశాల సరిహద్దు వెంబడి ప్రత్యేకంగా రాత్రివేళల్లో పటిష్ఠ ఏర్పాట్లు అవసరమని సూచించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అకృత్యాలకు సంబంధించిన కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు… భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ మోదీతో భేటీలో యూనస్ అధికారికంగా కోరారు.







