Modi: లంక పర్యటనలో నరేంద్రమోడీ..ద్వైపాక్షిక బంధం బలోపేతం దిశగా చర్చలు..
బిమ్స్ టెక్ సదస్సు నుంచి నేరుంగా ప్రధాని మోడీ (Modi) శ్రీలంక (Srilanka) చేరుకున్నారు. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే స్వాగతం పలికారు. లంక పర్యటనలో భాగంగా మోడీ…ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, రక్షణ రంగం, అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించనున్నారు. అధ్యక్షుడు అనుర కుమార(Anura Kumara) దిసానాయకేతో ప్రధాని మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు.
రెండేళ్ల క్రితం శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఆ సమయంలో భారత్ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీలంక నెమ్మది.. నెమ్మదిగా తేరుకుంటోంది. తాజాగా మోడీ పర్యటనతో శ్రీలంకకు మరింత మేలు చేకూరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా తంత్రంలో పడకుండా లంకను మోడీ కట్టడి చేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపర్యటనలో లంకలో పలు ప్రాజెక్టులను .. మోడీ ప్రారంభించే అవకాశం కూడా ఉంది.
మరోవైపు వివాదాస్పద కచ్చతీవు(kachchativu) అంశంపైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇది గతంలో భారత్.. శ్రీలంకకు వదిలేసింది. అయితే ఇప్పుడా ప్రాంతం మత్స్యసంపదకు ఆలవాలంగా మారింది. దీంతో దారి తప్పి అక్కడకు వెళ్తున్న తమిళ జాలర్లపై.. లంక నావికాదళం క్రూరంగా ప్రవర్తిస్తోంది. కాల్పులు జరుపుతోంది. లంక కాల్పుల్లో పలువురు జాలర్లు మరణిస్తున్న సందర్భాలున్నాయి. దీంతో ఈ దీవిని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల వేళ.. ఈప్రాంతంపై డీఎంకే ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది..







