నాటో దేశాలకు యుద్ధభయం..
రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలతో దాడులు చేసేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతి ఇవ్వడం నాటో (NATO) కూటమి దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధం ముంచుకొస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ.. లక్షలకొద్దీ బుక్లెట్లను పంచిపెట్టాయి. యుద్ధాల వేళ, కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు, విద్యుత్తు సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు దీనిలో ఉన్నాయి. ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరాయి.
మంచినీటి సీసాలు, స్టేషనరీ, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై దీనిలో సూచనలు ఉన్నాయి. యుద్ధ సమయంలో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలని అన్న విషయాలు దీనిలో స్పష్టంగా ఉన్నాయి. పిల్లల పేరెంట్స్, సంరక్షకులు కచ్చితంగా డైపర్స్, ఔషధాలు, చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి. ‘ఒకవేళ యుద్ధం వస్తే’ అనే పేరుతో స్వీడన్ ప్రభుత్వం 50 లక్షల బుక్లెట్లను వచ్చే రెండు వారాల్లో పంపిణీ చేయనుంది.
రెండో ప్రపంచయుద్ధం నుంచి ఇటువంటి బుక్లెట్లను పంచడం ఇది ఐదోసారి. దీనిని సోమవారం విడుదల చేయగా.. ఇప్పటికే 55,000 మందికి పైగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొన్నారు. ‘‘ప్రపంచంలో పరిస్థితి కొన్నేళ్ల నుంచి రానురాను దారుణంగా మారుతోంది. మనకు సమీపంలోనే యుద్ధం జరుగుతోంది. టెర్రర్, సైబర్, తప్పుడు సమాచార ముప్పులు పొంచి ఉన్నాయి’’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఫిన్లాండ్ కూడా ఇటువంటి కరపత్రాలనే ప్రింట్ చేసి పంపిణీ చేసింది. ఇప్పటికే ఈ దేశంలో 58 శాతం మంది ప్రజలు యుద్ధం వస్తే తట్టుకొనేలా అత్యవసర సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేసుకొన్నట్లు చెబుతున్నారు. నార్వే కూడా ఇటువంటివి 22 లక్షల బుక్లెట్లను ముద్రించి ఇంటింటికి పంపిణీ చేసింది.






