KCR: గులాబీ బాస్ ఇక రానట్లేనా..?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కి బయటకు రానట్లే కనపడుతుంది. భారత రాష్ట్ర సమితి అధినేతగా, తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వంపై ఒకరకంగా యుద్ధం చేస్తారని చాలామంది ఎదురు చూశారు. ఉద్యమ అనుభవం ఉన్న కేసీఆర్.. మానసిక పరిస్థితి కాస్త సెట్ అయిన తర్వాత బయటకు వస్తారని.. అందరూ ఎదురు చూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్ గా విమర్శలు ఉంటాయని… మళ్లీ మీడియా ఆయనను ఫోకస్ చేస్తుందని కూడా చాలామంది ఆశపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా కనపడటం లేదు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చివరి రోజు వరకు కూడా కెసిఆర్ ప్రజల్లోనే ఏదో ఒక రూపంలో కనిపించారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియే. ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కేసిఆర్ మాత్రం ప్రజలకు దూరం అయ్యే ప్రయత్నం చేయలేదు. రాజకీయంగా ఎటువంటి గడ్డి పరిస్థితులు గులాబీ పార్టీ ఎదుర్కొన్న సరే కేసీఆర్ మాత్రం ప్రజల్లో ఉండేందుకు ఆసక్తి చూపించారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసిన గులాబీ బాస్ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఎంతో బలంగా ఉండేది. అయినా సరే ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం చేశారు. 2009 ఆయన చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి కెసిఆర్ ఇప్పుడు బయటకు రాకపోవడం వెనుక కారణాలేంటి అనేది స్పష్టత లేకపోయినా ఆయన ఇక రారు అనే క్లారిటీ మాత్రం చాలా మందికి వచ్చేసింది.
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన గురించి ఎదురు చూడటం మానేశారు. కేటీఆర్ ను భవిష్యత్తు నాయకుడిగా అంగీకరించడం మొదలుపెట్టారు ఆ పార్టీ నేతలు. కేసీఆర్ మాట్లాడితే మీడియాలో ఉండే హడావుడి వేరు ఉంటుంది. ఆయన చేసే ప్రసంగాలకు హడావుడి ఎక్కువ. జాతీయ మీడియా కూడా కెసిఆర్ ప్రసంగాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి కెసిఆర్ ఇప్పుడు కనీసం మాట్లాడకపోవడం వెనుక కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అనుమానాలు కూడా వస్తున్నాయి.
కవిత ఢిల్లీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్ చాలా నీరసంగా కనిపించారు. గతంలో కేసీఆర్ ఎప్పుడూ అలా కనపడలేదు. దీనితో ఇక ఆయన బయటకు రాకపోవచ్చు అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఏం ప్రకటన వచ్చినా సరే అనవసరంగా పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు కేటిఆర్.
ఈ సమయంలో కేసీఆర్ నుంచి కచ్చితంగా మద్దతు కావాల్సి ఉంటుంది. ఆయనను ఏ సమయంలో అయినా సరే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కెసిఆర్ బయటకు వచ్చి మాట్లాడి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి పెద్ద ఎలాగో ఆ పార్టీకి కేసీఆర్ అలాగే. హరీష్ రావు కేటీఆర్ లేదంటే పాడి కౌశిక్ రెడ్డి అప్పుడప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినా కేసీఆర్ మాట్లాడితే ఉండే వెయిటేజ్ వేరు ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు వచ్చే ఉత్సాహం వేరే లెవల్ లో ఉంటాయి. కాబట్టి కెసిఆర్ రావాలని చాలామంది కోరుతూ వచ్చారు. అయితే ఆయన బయటకు రాకపోవడంతో పార్టీ కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారు. మరి ఎప్పుడు వస్తారో చూడాలి.