Iran: ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ.. అబు ఖదీజా హతం..
ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ (Abu Khadeejah) అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ లాజిస్టిక్స్, ప్రణాళిక, ఆర్థిక నిర్వహణను అబూ ఖదీజా పర్యవేక్షిస్తున్నాడు. వైమానిక దాడి తర్వాత యూఎస్ సెంట్రల్ కమాండ్, ఇరాకీ దళాలు ఘటన స్థలానికి చేరుకుని అబు ఖదీజా, ఇతర ఐఎస్ఐఎస్ ఫైటర్లు మరణించినట్లు నిర్ధారించారు ఇద్దరు ఆత్మాహుతి దుస్తులు ధరించి, మల్టిపుల్ వెపన్స్‌ని కలిగి ఉన్నట్లు తేలింది. డీఎన్ఏ మ్యాచ్ ద్వారా మరణించింది అబు ఖదీజాగా నిర్ధారించారు.
అబు ఖదీజా ఐసిస్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. యూఎస్‌తో పాటు దాని మిత్రదేశాల సైనికులకు తరచూ హెచ్చరికలు పంపిస్తుంటాడని అమెరికన్ అధికారులు తెలిపారు.. ఇలా తమను బెదిరించే వారిని తము నిర్వీర్యం చేస్తూనే ఉంటామని యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా చెప్పారు. ఇరాకీ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఆపరేషన్ని ప్రశంసించారు. 2023లో అబు ఖదీజాపై అమెరికా ఆంక్షలు విధించింది. 2017 నుంచి ఇతను ఐసిస్‌లో చురుకుగా ఉన్నాడు. ఐసిస్ నాయకుడు చనిపోవడంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మా యోధులు నిరంతరం ఉగ్రవాదుల్ని వేటాడుతారని చెప్పారు.






