Indigo : ఇండిగో సంక్షోభం.. అసలు ఏం జరిగింది?
దేశ విమానయాన రంగంలో ఎన్నడూ లేని అలజడి రేగింది. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (Indigo) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవలం ఒక్క రోజులోనే దాదాపు 1000కి పైగా విమానాలు రద్దయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్టులు ప్రయాణికుల ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. అసలు దేశంలో నంబర్ వన్ ఎయిర్‌లైన్ అని చెప్పుకునే ఇండిగోకు సడెన్ గా ఏమైంది? వాతావరణం, టెక్నికల్ సమస్యలే కారణమా? లేక దీని వెనుక మరేదైనా పెద్ద కారణం ఉందా?
డిసెంబర్ మొదటి వారం నుండి ఇండిగో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజువారీ షెడ్యూల్ లో దాదాపు 50 శాతం విమానాలు రద్దయ్యాయి. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక, రీఫండ్ రాక జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను 200 నుండి 300 శాతం పెంచేశాయి.
ఇండిగో చెప్తున్నట్లు ఇది కేవలం ఆపరేషనల్ ఇష్యూ మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం DGCA (Directorate General of Civil Aviation) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు. పైలట్లు నిద్రలేమితో అలసిపోయి విమానాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని భావించిన DGCA, FDTL (Flight Duty Time Limitation) పేరుతో కొత్త రూల్స్ ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం గతంలో పైలట్లకు వారానికి 36 గంటల రెస్ట్ ఉండేది. కొత్త రూల్స్ ప్రకారం అది 48 గంటలకు పెరిగింది. రాత్రి డ్యూటీలో ఒక పైలట్ గతంలో 6 ల్యాండింగ్స్ చేసేవారు. ఇప్పుడు గరిష్టంగా 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. రాత్రిపూట డ్యూటీ సమయాన్ని కూడా తగ్గించారు. ఈ నిబంధనల వల్ల, గతంలో ఉన్న పైలట్లతోనే పాత షెడ్యూల్ నడపడం అసాధ్యంగా మారింది. పైలట్లకు ఎక్కువ రెస్ట్ ఇవ్వాల్సి రావడంతో.. కాక్‌పిట్ లో కూర్చోవడానికి పైలట్లు లేని పరిస్థితి తలెత్తింది.
నిజానికి ఈ కొత్త రూల్స్ రాత్రికి రాత్రి వచ్చినవి కావు. వీటి గురించి రెండేళ్ల క్రితమే చర్చ జరిగింది. 2024 జూన్ లోనే అమలు కావాల్సి ఉన్నా, ఎయిర్‌లైన్స్ ఒత్తిడి వల్ల నవంబర్ 2025కి వాయిదా పడ్డాయి. ఇంత సమయం ఉన్నా, ఇండిగో యాజమాన్యం తగినంత మంది కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోలేదు. తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ పని చేయించుకునే Lean Manpower Strategy ని ఫాలో అయ్యింది. ఎప్పుడైతే రూల్స్ కఠినంగా మారాయో, షెడ్యూల్ మొత్తం కుప్పకూలింది. ఇది కచ్చితంగా యాజమాన్య వైఫల్యమే అని చెప్పొచ్చు.
ప్రయాణికుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా, కొత్త FDTL నిబంధనల అమలును వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంటే, పాత పద్ధతిలోనే పైలట్లు డ్యూటీ చేయొచ్చు. దీంతో రానున్న రోజుల్లో విమాన సేవలు సాధారణ స్థితికి రావొచ్చు. ప్రభుత్వం రూల్స్ సడలించడం వల్ల విమానాలు నడుస్తాయి సరే.. కానీ ప్రయాణికుల భద్రత మాటేమిటి? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలసిపోయిన పైలట్లతో విమానాలు నడిపించడం క్షేమమేనా? పైలట్ సంఘాలు ఈ సడలింపును వ్యతిరేకిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప, సేఫ్టీ కోసం కాదని ఆరోపిస్తున్నాయి.
ఇండిగో సంక్షోభం మన విమానయాన రంగంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. ఎయిర్‌లైన్స్ లాభాల కంటే ప్లానింగ్, ప్యాసింజర్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఆ మూల్యం చాలా భారీగా ఉంటుంది.






