Jagan: జగన్ కు షాక్ ఇచ్చిన సర్వే రిపోర్ట్స్.. ఇకనైనా స్ట్రాటజీ మారుస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా సమానంగా పనిచేయాలన్న భావన ఇప్పుడు మరింతగా వినిపిస్తోంది. విపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం కూడా మరింత బాధ్యతతో ముందుకు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Y S Jagan Mohan Reddy) ఇటీవల సర్వేలపై మరలా దృష్టి పెట్టారని తెలుస్తోంది.
2019 నుండి 2024 వరకు జగన్ అనేక సర్వేలపై ఆధారపడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పేరున్న మీడియా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు, అలాగే పార్టీకి అండగా ఉన్న ఐపాక్ (IPAC) కూడా నిత్యం అధ్యయనాలు చేస్తూ వచ్చాయి. కానీ మైదానంలో కనిపించే వాస్తవ పరిస్థితులను ఇవి పూర్తిగా అంచనా వేయలేకపోయాయని, కొన్నింటిని జగన్ చెవికి చెప్పేందుకు కూడా ఎవరికీ ధైర్యం లేకపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ లోపాలే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బతీశాయి.
2017లో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పార్టీకి చేరడంతో ఐపాక్ టీం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి అంకితమైంది. ఆయన పాదయాత్ర వ్యవహారాన్ని ఐపాక్ బాధ్యత తీసుకుంది. ఋషిరాజ్ సింగ్ (Rishiraj Singh) టీం యాత్ర నిర్వహణ, సమన్వయాన్ని చూసుకునే వారు. 2019లో అవి మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే తరువాత ప్రశాంత్ కిషోర్ స్వరాష్ట్రం బీహార్లో తన రాజకీయ అవకాశాలను ప్రయత్నించగా అక్కడ విజయం దక్కలేదు. దీని ప్రభావం ఐపాక్ పై పడిందని, తాజాగా జగన్కు ఆ టీంపై నమ్మకం తగ్గినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో జగన్ కొత్తగా ఢిల్లీలోని ఒక సర్వే సంస్థ సహాయం తీసుకున్నారని సమాచారం. అయితే ఆ సంస్థ కూడా పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) టీమ్ ద్వారానే నడుస్తోందని చెప్పబడుతోంది. చెవిరెడ్డి కుమారుడు ఆ టీంను సమన్వయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వరుసగా సర్వేలు తప్పుదోవ పట్టించాయన్న భావనతో జగన్ ఇప్పుడు ఆ టీంపై కూడా అసంతృప్తిగా ఉన్నారని పట్టు వర్గాల్లో చర్చ.
ఈ కొత్త సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదని తేలిందని సమాచారం. ప్రధానంగా రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థితి బలహీనపడిందని పేర్కొన్నారట. ముఖ్యంగా పులివెందుల (Pulivendula) జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి. అదనంగా, పార్టీ ఇచ్చే ఆందోళన పిలుపుల సమయంలో అధినేత హైదరాబాద్ లేదా బెంగళూరు (Bengaluru) వెళ్లిపోవడాన్ని పార్టీ శ్రేణులు అసహనంగా చూస్తున్నారని ఈ సర్వే చెబుతోందట. ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికల ఫలితాలను మళ్లీ 2029 లో ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ అధ్యయనం హెచ్చరించడం జగన్కు అసలు ఊహించని షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఆశలతో ఈ సర్వే చేయించుకున్న జగన్కు రిపోర్ట్ మరింత ఆందోళన పెంచే విషయాలను హైలైట్ చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం ఇప్పటికైనా జగన్ తన వ్యవహార శైలి మార్చుకుంటారేమో చూడాలి..






