Pawan Kalyan: డిప్యూటీ సీఎంతో సినిమా తీయాలి అనుకున్న ఎమ్మెల్యే.. జ్ఞాపకాల కథ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ ప్రపంచంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. ఆయన కెరీర్ ప్రారంభ దశలో వచ్చిన సుస్వాగతం చిత్రం ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చింది. అదే సినిమాను ఆధారంగా చేసుకుని ఒక ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిని మాజీ మంత్రి, ప్రస్తుతం చిలకలూరిపేట (Chilakaluripet) ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Pattipati Pullarao) స్వయంగా వెల్లడించారు.
చిలకలూరిపేటలో జరిగిన మెగా టీచర్-పేరెంట్ మీటింగ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, 1998లో జరిగిన ఒక విశేషాన్ని గుర్తుచేసుకున్నారు. పాలిటిక్స్ లోకి రాకముందు తాను పవన్ కళ్యాణ్ కు అభిమానినని, సుస్వాగతం సినిమా ప్రివ్యూ షో చూసిన తర్వాత ఆయనతో సినిమా నిర్మించాలని అనుకున్నానని తెలిపారు. ఆ ప్రివ్యూ షోకు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు (Bhimaneni Srinivasa Rao) కూడా హాజరయ్యారని చెప్పారు. సినిమా ముగిసిన వెంటనే పవన్‌కు సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందనీ, తన అభ్యర్థనకు పవన్ వెంటనే అంగీకరించారని పుల్లారావు గుర్తుచేశారు.
అయితే అదే సమయంలో అనుకోని రాజకీయ పరిణామాలు తన జీవితాన్ని మార్చేశాయని, సినిమాను నిర్మించే ప్లాన్ ఆగిపోయిందని తెలిపారు. భీమినేని స్వగ్రామమైన బేతపూడి (Bethapudi) తమ ఊరికి అతి దగ్గర అని, అందువల్ల ఆ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పారు. రాజకీయాల్లోకి ప్రవేశించకపోయి ఉంటే పవన్‌తో కలిసి ఒక పెద్ద చిత్రాన్ని తీసేవాడినని, అది ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేదని అన్నారు.
పుల్లారావు మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ వేదికపై శ్రద్ధగా విన్నారు. తన పట్ల ఇంత ప్రేమ, గౌరవంతో చెప్పిన మాటలు వినడం పవన్‌కూ ఆనందాన్నిచ్చినట్టు కనిపించింది. కార్యక్రమంలో ఉన్నవారంతా కూడా ఆసక్తిగా ఈ సంఘటనను విన్నారు. పుల్లారావు, పవన్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆయనను అభిమానులు ఎందుకు ఇంతగా ప్రేమిస్తారో కూడా వివరించారు. కోట్లాది అభిమానుల హృదయాల్లో పవన్ ఉండటానికి కారణం ఆయన నిజాయితీ మరియు అంకితభావం అని చెప్పారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఆత్మీయత కలగలిపి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అభినందించారు. మొత్తానికి, పాత జ్ఞాపకాలు, అభిమాన భావాలు కలిసిన ఈ సంఘటన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ – ప్రత్తిపాటి పుల్లారావు మధ్యన ఉన్న ఆ అనుబంధం అందరిని ఆకట్టుకుంది.






