Jayamangala: ఎమ్మెల్సీ జయమంగళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు (MLC) జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkata Ramana) రాజీనామాను ఆమోదించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా, మండలి చైర్మన్ తరపు న్యాయవాది అదనపు సమయం కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినప్పటికీ మరిన్ని రోజులు కావాలని అభ్యర్థించడంపై ఆగ్రహించిన న్యాయమూర్తి, కౌంటర్ దాఖలు చేయడానికి అదనపు సమయం ఇస్తూ 10 వేల రూపాయలు ఖర్చులకోసం చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని రేపు సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేశారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన జయమంగళ వెంకటరమణ, ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2023లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపో ఓడిపోయింది. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2024 నవంబర్ 23న వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే MLC పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను YSRCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, శాసన మండలి చైర్మన్ కె.మోసెన్ రాజుకు (Moshen Raju) పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవిలో కొనసాగలేనని, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇటీవల ఆయన జనసేన పార్టీలో చేరారు.
అయితే జయమంగళ వెంకటరమణ రాజీనామాను మండలి ఛైర్మన్ మోషన్ రాజు ఇప్పటివరకూ ఆమోదించలేదు. 10 నెలలు అవుతున్నా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మండలి చైర్మన్‌ను తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశించాలని, లేదంటే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ లో కోరారు. పిటిషనర్ తరపున ఎన్.అశ్వని కుమార్ వాదనలు వినిపించారు. చైర్మన్ నిర్ణయం తీసుకోకపోవడం రాజీనామా ప్రక్రియకు అవరోధంగా మారిందన్నారు. రాజీనామా లేఖ అందిన వెంటనే స్వయంగా లేదా ఏదైనా ఏజెన్సీ ద్వారా విచారణ చేసి తీర్పు ఇవ్వాలని… కానీ 10 నెలలు గడిచినా ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా గత విచారణ సమయంలోనే మండలి ఛైర్మన్ తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవాల్టి విచారణ సమయానికి కూడా మండలి ఛైర్మన్ తరపున కౌంటర్ దాఖలు చేయలేదు. ఇవాల్టి విచారణలో మరికొంత గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇంకా ఆలస్యం చేయడం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసు రాజకీయ సున్నితత్వం కలిగి ఉన్నప్పటికీ, న్యాయప్రక్రియలు వేగంగా జరగాలని న్యాయమూర్తి హెచ్చరించారు.
వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేశారు. వాళ్లవికూడా ఆమోదం పొందలేదు. జయమంగళ వెంకటరమణతో పాటు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జకియా ఖానం.. రాజీనామా చేసినా కూడా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు పట్టించుకోవట్లేదు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించడం, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.