Gaza: హమాస్ కు నిధుల కటకట.. సిబ్బంది జీతాలకు ఇబ్బందులు..
గాజాలో యుద్ధం కారణంగా ఉగ్రవాద సంస్థ హమాస్ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా హమాస్ కు నిధుల సరఫరాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్… ఆసంస్థను గట్టి దెబ్బేతీసింది. ప్రస్తుతం హమాస్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందంటే… ఇప్పుడు తమ దగ్గర పనిచేస్తున్న వారికి నెలయ్యే సరికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. ఈ పరిస్థితిని అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్(Israel) భారీగా కోత విధించడంతో.. హమాస్ దోచుకొని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని సమాచారం.. దీంతో పాటు ఆ సంస్థలో నిధుల పంపిణీకి బాధ్యత వహించేవారిని గుర్తించి మరీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేస్తున్నాయి.
యుద్ధం మొదలుకావడానికి ముందు ప్రతినెలా దాదాపు 15 మిలియన్ డాలర్లు ఖతార్ నుంచి లభించేవి. దీంతోపాటు ఏటా 500 మిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిధుల రూపంలో వచ్చేవి. గాజాలో పోరు మొదలయ్యాక నిధుల రాక బాగా కష్టతరంగా మారిపోయింది. యుద్ధం ప్రారంభంలో బ్యాంక్ ఆఫ్ పాలస్తీనా శాఖల నుంచి 180 మిలియన్ డాలర్లు తీసుకొన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.
యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న హమాస్.. ఇప్పుడు సైన్యంలో చిన్నపిల్లలు, యువతను కూడా నియమించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపు 30,000 మంది యువతను ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్‌లో చేర్చుకొన్నట్లు సౌదీకి చెందిన అల్ అరేబియా ఛానెల్ తెలిపింది. వీరిలో చాలామంది గతంలో శిక్షణకు హాజరైనవారు ఉన్నట్లు అభిప్రాయపడింది. కాకపోతే ఆ క్యాంపు ఇప్పటికీ ఉందా.. లేదా అనే అంశంపై స్పష్టత లేదని పేర్కొంది. కొత్తగా హమాస్‌లో చేరిన వారికి గెరిల్లా యుద్ధతంత్రం, రాకెట్లు ప్రయోగించడం, బాంబులు అమర్చడం తప్ప ఇక ఇతర నైపుణ్యాలు లేవని పేర్కొంది.
ప్రస్తుతం హమాస్ వద్ద ఆయుధాలు, డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో వాడిన క్షిపణుల శకలాలను, పేలకుండా ఉండిపోయిన ఇజ్రాయెల్ దళాల మందుగుండును రీసైకిల్ చేస్తున్నారు. వీటిని భూమిపై అమర్చే పేలుడు పదార్థాలుగా వాడుతున్నట్లు తెలుస్తోంది.







