Trump: ట్రంప్ కు న్యూ హాంప్ ఫెడరల్ కోర్టు షాక్.. జన్మతః పౌరసత్వంపై ఆదేశాలు నిలిపివేత

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జన్మతః పౌరసత్వంపై జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాన్ని నిలిపివేస్తూ ఫెడరల్ న్యాయమూర్తి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు అమెరికా పౌరసత్వ విధానంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చను మరింత ముమ్మరం చేయడంతో పాటు ఈ వివాదాన్ని మళ్లీ సుప్రీం కోర్టుకు వేగంగా చేర్చే అవకాశం కనిపిస్తోంది.
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను న్యూహాంప్ షైర్ ఫెడరల్ కోర్టు జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ నిలిపి వేశారు. ఈ ఆదేశాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీనిపై అప్పీలుకు వీలుగా ఏడు రోజుల పాటు స్టే విధించారు. ఈ సందర్భంగానే న్యాయమూర్తి మాట్లాడుతూ.. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం లభిస్తుందని కోర్టు పేర్కొంది.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుంది. దీనినే ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ అంటారు. అయితే అక్రమ వలసదారులకు పుట్టిన పిల్లలకు ఈ నిబంధన వర్తించదనే వాదనతో ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. 14వ సవరణలో ఉన్న అమెరికా అధికార పరిధికి లోబడి ఉన్నవారు (subject to the jurisdiction thereof) అనే పదాన్ని ట్రంప్ మద్దతుదారులు తమ వాదనకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. అంటే విదేశీ శక్తులకు కాకుండా.. అమెరికా పూర్తి అధికార పరిధికి లోబడిన వారికే ఇది వర్తిస్తుందని వాదిస్తున్నారు.