Donald Trump: రష్యా ఉక్రెయిన్ వార్.. మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తోందా..?
రష్యా ఉక్రెయిన్ వార్.. మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తుందా..? రెండు దేశాల మధ్య శాంతిని అమలు చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వకపోవడంతో.. ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.‘రక్తపాతం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నా. గత నెలలో 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువమంది సైనికులే ఉన్నారు. బాంబుల వల్ల మరికొందరు చనిపోయారు. ఇది వెంటనే ఆగిపోవాలి. అందుకు మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ఇలాంటి పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అందరూ ఆటలు ఆడుతున్నారని నేను అంతకుముందే చెప్పాను. అలా జరగాలని కోరుకోవడం లేదు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ ప్రభుత్వంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
ఇక, నాలుగేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ అసహనంతో ఉన్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ ఆయా దేశాల అధికారుల నుంచి మాటలు కాకుండా.. ఫలితాలు కోరుకుంటున్నారన్నారు. చర్చలతో విసిగిపోయిన అధ్యక్షుడు చర్యలకు సిద్ధమైనట్లుగా తెలిపారు. ఈ శాంతి ప్రణాళిక (Russia-Ukraine peace plan)ను ముందుకుతీసుకెళ్లడంలో ట్రంప్ పరిపాలనా సిబ్బంది చురుకుగా ఉన్నారన్నారు. యూరోపియన్ నేతలతో చర్చించేందుకు అధ్యక్షుడు సిద్ధమైనట్లు వెల్లడించారు. పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ బృందం రష్యా- ఉక్రెయిన్లతో చర్చలు కొనసాగిస్తున్నారన్నారు.
ఇక, ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించేందుకు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళిక ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 20 పాయింట్లతో కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. దీన్ని అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పటికే అందించినట్లు తెలిపారు. డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామన్నారు.






