China-Pakistan: పాకిస్తాన్ కు చైనా బలగాలు..? జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్ ఘటనతో మారిన సమీకరణాలు?
చైనా-పాకిస్తాన్ సంయుక్తంగా చేపడుతున్న సీపెక్ ప్రాజెక్టు భవితవ్యాన్ని.. జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్ ఘటన సందిగ్ధంలో పడేసింది. ఓ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే మిలిటెంట్ సంస్థ ఏకంగా ట్రైన్ హైజాక్, పలువురిని చంపేయడంతో.. ఆ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బందిలో వణుకు మొదలైంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల్లో చైనాకు చెందిన 30 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిపై తరచూ దాడులు జరుగుతున్నాయి.అయితే ఏకంగా ట్రైన్ హైజాక్ ఘటన వారి మనస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా ఇప్పుడు వారి భద్రతపై ఇరుప్రభుత్వాలు ఫోకస్ పెట్టాల్సివచ్చింది.
పాకిస్థాన్‌లో బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు పెరుగుతున్న వేళ చైనా కీలక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బీజింగ్‌కు చెందిన ప్రైవేటు భద్రతా దళాలను పాక్‌కు మద్దతుగా మోహరించాలన్నది దీని సారాంశం. ఇటీవల సీపెక్ ప్రాజెక్టులోని వర్కర్స్‌ను, ఇంజినీర్లను కాపాడేందుకు తమ దేశానికి చెందిన ప్రైవేటు భద్రతా బృందాలు, మిలిటరీ సిబ్బందిని నియమించేందుకు వీలుగా ఓ ఒప్పందంపై సంతకం చేసింది. దీని కింద డెవ్వె సెక్యూరిటీ ఫ్రాంటియర్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్, హుయాక్సిన్ ఝాంగ్‌షాన్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షించనున్నాయి.
బలోచ్ రెబల్స్ దాడుల నేపథ్యంలో చైనా జాతీయుల భద్రత ప్రధానంగా మారింది. గతేడాది ఇద్దరు చైనా జాతీయులపై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బీఎల్ఏ కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో పాక్‌లో బీజింగ్ దళాలను మోహరించే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా బలగాల మోహరింపులో ఇది కీలక అడుగుగా మారనుంది.
మరోవైపు పాక్-చైనా సంయుక్త సెక్యూరిటీ కంపెనీ ఏర్పాటు చేయాలని బీజింగ్(Bejing) ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సీపెక్‌లోని ప్రాజెక్టులు, ఉద్యోగుల రక్షణ బాధ్యతల కోసం దీనిని వినియోగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని చైనా(china) కోరుతోంది. ఇదే జరిగితే డ్రాగన్ సైన్యం పాక్ గడ్డపై అధికారికంగా అడుగుపెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్‌లో దాదాపు 30 వేల మంది చైనా జాతీయులు పనిచేస్తున్నారు. వారి భద్రతే ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా బలోచిస్థాన్(balochistan), గ్వదార్ ప్రాంతాల్లో ముప్పు మరింత తీవ్రంగా ఉంది.






