బీజేపీ బలం, బలహీనత మోడీనే..!

నాడు బీజేపీ అంటే నైతిక విలువలు, హుందాతనం, సైద్దాంతిక భావజాలం అణువణువునా ఉట్టిపడే పార్టీ.. అక్కడ లీడర్ కన్నా పార్టీయే మిన్న. నువ్వు కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టినా సరే నీలో అంకితభావం, నాాయకత్వ పటిమ ఉంటే చాలు.. నువ్వు పైపై స్థాయికి ఎదిగిపోవడం ఖాయం. దీనికి పక్కా ఉదాహరణలు వాజ్ పేయి. అద్వానీ, మోడీ, వెంకయ్యనాయుడు తదితర నేతలు.అందులో ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా అంటే బీజేపీని ముందుండి నడిపిస్తోంది ప్రధాని మోడీ. ఆయన పేరుతోనే బీజేపీ ఈసారి ఎన్నికలను ఫేస్ చేస్తోంది. ఇది మోడీ గ్యారంటీ.. మోడీ భరోసా.. మోడీ నాయకత్వ పటిమతోనే దేశం అగ్రస్థానం దిశగా దూసుకెళ్తోందని బీజేపీ అగ్రనేతలు సైతం నొక్కి,వక్కాణిస్తున్నారు.
అంటే సమష్టితత్వం నుంచి బీజేపీ నెమ్మదిగా వ్యక్తి చరిష్మాపై ఆధారపడే స్థాయికి చేరింది. అంటే ప్రస్తుతం మోడీ చరిష్మాపై ఆధారపడుతోంది. ఏ ఎన్నిక అయినా మోడీ ఉండాల్సిందే.. మోడీ ప్రచారం లేకుంటే కష్టమే అన్న స్థాయికి చేరింది. అంటే ఓ విధంగా కమలనాథులకు కష్టంగా ఉన్నా సరే , కటువుగా ఉన్నా పార్టీని మించి మోడీ ఎదిగిపోయారన్నది వాస్తవం. ఎందుకంటే.. వారి పోస్టర్లు, బ్యానర్లలో సైతం మోడీ బొమ్మే పెద్దదిగా కనిపిస్తోంది మరి.
ప్రస్తుతానికి ఈ పరిస్థితిని కమలం నేతలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాదగ్గర బాహుబలి మోడీ ఉన్నారు. మరి మీపరిస్థితి ఏంటని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. మరి మోడీ తర్వాత అంటే.. ఆ ప్రశ్నకు బదులే లేకుండా పోయింది. అసలు మోడీ ఉండగా.. అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని సాక్షాత్తూ అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి సీనియర్లు సైతం మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. అంటే పార్టీలో నెంబర్ 2 అన్న లీడర్ లేడు. ఉన్నదల్లా ఒక్కడే ఆయనే దగ్రేట్ మోడీ. దేశాన్ని పాలించడం దగ్గర నుంచి ఎన్నికల వ్యూహరచన వరకూ అన్నింటా మోడీనే కనిపిస్తున్నారు.
మోడీ తర్వాత ఎలా అన్న పరిస్థితిని బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ అస్సలు ఊహించడం లేదు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్త కూడా మోడీ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆనందిస్తోంది కానీ.. మోడీ తర్వాత అలాంటి లీడర్ ఎవరు అన్నదానిపై దృష్టి సారించడం లేదు. ఏతా వాతా మోడీ తర్వాత రేసులో అమిత్ షా, యోగీ ఉన్నారు. మరి వీళ్లిద్దరు కాకుండా ఎవరికైనా అవకాశం ఉంటుందా..? లేకుంటే ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా అన్న పరిస్థితి నుంచి ఇవాళ గెలుపెలారా దేవుడా అన్న కాంగ్రెస్ పరిస్థితి దాపురిస్తుందా..? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.