BJP: దేశంలో బీజేపీ ప్రాభవం తగ్గుతోందా..?

దేశంలో అతి పెద్ద పార్టీలు రెండే. ఒకటి కాంగ్రెస్ (Congress), మరోకొటి భారతీయ జనతా పార్టీ (BJP). ఈ రెండింటి మధ్యే దశాబ్దాలుగా పోరు నడుస్తోంది. అయితే పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి పూర్తిగా దూరమైంది. నరేంద్ర మోదీ (Narendra Modi) భారతీయ జనతాపార్టీకి అప్రతిహత విజయాలు అందిస్తూ వస్తున్నారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! బీజేపీ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఆ పార్టీకి కాలం కలిసొస్తున్నట్టు లేదు. రోజురోజుకూ ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అటల్ బిహారీ వాజ్ పేయి (Vajpayee), ఎల్.కె.అద్వానీ (Advani), మురళీ మనోహర్ జోషి (Murali Manohar Joshi) లాంటి వాళ్లు బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. 2 స్థానాల నుంచి ఇప్పుడు అధికారాన్ని అప్రతిహతంగా కొనసాగించేంత వరకూ మలిచారు. నరేంద్ర మోదీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah) బీజేపీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2014లో బీజేపీ 282 సీట్లు సాధించి సొంతంగా అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 2019లో 303 సీట్లతో తిరుగులేదనిపించుకుంది. ఇక తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీకి సీట్లు తగ్గాయి. ఆ పార్టీకి 240 సీట్లు రాగా ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2024 ఎన్నికల తర్వాత బీజేపీ హవా తగ్గుతోందని సర్వేలు కూడా చెప్తున్నాయి. పరిపాలనాపరంగా మోదీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో దేశానికి ఎంతో మేలు చేసేవే అయినా తాత్కాలిక సెంటిమెంట్లకు అలవాటు పడిన ప్రజలు ఆ పార్టీపై వ్యతిరేక భావంతో ఉన్నట్టు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఆర్టికల్ 370 (Article 370), ఒకే దేశం ఒకే ఎన్నిక (One Nation One Election), వక్భ్ బోర్డు (WAQF Board) చట్టంలో మార్పులు.. లాంటి అనేక సంస్కరణలను మోదీ ప్రభుత్వం చేపట్టింది. వీటిపై ఎన్ని విమర్శలు వచ్చినా మోదీ సర్కార్ వెనక్కు తగ్గలేదు. అలాగే రైతు ఉద్యమాన్ని (Farmers Movement) కూడా సరిగా హ్యాండిల్ చేయలకేపోయిందనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా హర్యాణా (Haryana), జమ్ము కశ్మీర్ (Jammu Kashmir) కు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ గెలుస్తుందనే సూచనలు కనిపించట్లేదు. హర్యానాలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. అయితే 8వ తేదీ ఫలితాల తర్వాత బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్ని సర్వేలూ (Surveys) స్పష్టం చేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ లో హంగ్ (Hung) వస్తుందని మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. అక్కడ కూడా ఇండియా కూటమికి (INDIA Alliance) ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చాయి. అంతేకాదు.. త్వరలో ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర (Maharahtra), ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల్లో కూడా బీజేపీ పరిస్థితి గొప్పగా లేదని ప్రీపోల్ సర్వేలు చెప్తున్నాయి.