భరతుడిని తలపించేలా ఢిల్లీ సీఎం అతిశీ తీరు

ఢిల్లీ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆతిశీ సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. సెప్టెంబర్ 21న బాధ్యతలు స్వీకరించిన ఆమె అర్వింద్ కేజీవాల్ సీఎంగా ఉన్నప్పుడు కూర్చున్న కుర్చీలో ఆమె కూర్చోకుండా ఆ కుర్చీ పక్కనే మరో కుర్చీ వేయించుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. అయితే ఆమె బాధ్యతలు స్వీకరించిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు, గురుభక్తి ప్రదర్శిందని మరికొందరు అంటున్నారు.
ఎవరేమనుకున్నా ఆతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విధానం భారత ఇతిహాసమైన రామాయణంలోని ఒక ఘట్టాన్ని తలపించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆమెను కొనియాడుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం అతిశీని పెద్ద డ్రామాకు తెరలేపిందని ఎద్దేవా చేశారు. ఆతిశీని కొత్త మన్మోహన్ సింగ్ అని పిలుస్తూ, షెహద్ పూనావాలా ఖాళీ కుర్చీతో ఉన్న ఫోటోనీ పోస్ట్ చేశారు. దీనికి అతిశీ ప్రతిస్పందనగా "ఆ చైర్ ఆర్వింద్ కేజీవాల్ జీ ది.. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్" అని సింపుల్ గా స్పందించారు.
2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె కొద్దిరోజులే ఈ పదవిలో ఉండనున్నారు. ఈపదవి తనది కాదని.. తిరిగి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ గెలవడం పక్కా అంటున్నారు అతిశీ.. ఆయన గెలిచిన తర్వాత సీఎంగా ఎన్నికవుతారని.. అంతవరకూ తాను బాధ్యతలు నిర్వర్తిస్తామంటున్నారు అతిశీ. కేజ్రీవాల్ చూపిన బాటలోనే పాలన సాగిస్తామంటున్నారు. అయితే ఇప్పటికే చాలా శాఖలు నిర్వహించిన అతిశీ.. ఇప్పుడు కొత్తగా సీఎం పదవిని నిర్వర్తిస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎందరో సీనియర్లున్నా.. అతిశీపైనే నమ్మకంతో కేజ్రీవాల్ ఈబాధ్యతలు అప్పగించారు. మరీ ముఖ్యంగా ఆయన భార్య సునీత కూడా… అఖిలభారతీయ సర్వీసుకు చెందిన అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఆమెను కాదని.. అతిశీకి బాధ్యతలు అప్పగించారు. సునీతకు అప్పగిస్తే.. అది కుటుంబవారసత్వం అవుతుందని బీజేపీ విమర్శలు చేసేందుకు కారణమవుతుందని భావించే .. ఈనిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.