Politics Vs Cinemas: వెండితెర వెలుగులే బెటర్.. పొలిటికో సెలబ్రిటీల ఆవేదన

సినిమా రంగం (Cinema Industry) నుంచి రాజకీయాల్లోకి (Politics) అడుగుపెట్టడం మన దేశంలో కొత్త కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు వెండితెరపై తమ ఇమేజ్‌ను రాజకీయ విజయాలుగా మలచుకున్నారు. అయితే, ఈ గ్లామరస్ ప్రయాణంలో విజయ శిఖరాలను చేరుకున్నవారు కొందరైతే, క్షేత్రస్థాయి రాజకీయాల కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులతో నిరాశకు గురైనవారు ఎంతో మంది ఉన్నారు. రాజకీయాల వల్ల నష్టం తప్ప లాభం లేదని భావించేవారు ఈ మధ్య పెరుగుతున్నారు. తాజాగా కేరళకు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ (Suresh Gopi) .., బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
కేరళ నుంచి బీజేపీ తరఫున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సురేశ్ గోపీ, రాజకీయాల్లో లాభం కంటే నష్టమే ఎక్కువని బహిరంగంగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. సినిమాలు చేసుకుంటే మంచి ఆదాయం ఉండేదని, కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయిందని, అవసరాలు తీరడం లేదని ఆయన వాపోయారు. మంత్రి పదవిని వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పడం, రాజకీయ జీవితంపై ఆయనకున్న అసంతృప్తిని తెలియజేస్తుంది.
దీనికి కొనసాగింపుగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని పోల్చుతూ.. రాజకీయం చాలా కష్టమని, పైగా ఇందులో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువని నిట్టూర్చారు. ఒక నిజాయితీపరుడైన ఎంపీకి వచ్చే జీతం తమ నియోజకవర్గాల్లో పర్యటనలు, పీఏల జీతాలు, ఇతర అవసరాలకు సరిపోవడం లేదని, లక్షల్లో ఖర్చవుతోందని ఆమె వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నిజాయితీగా ప్రజా సేవ చేసేందుకు ఎవరూ ముందుకు రారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ స్థాయి సమస్యలను కూడా తమ వద్దకు ప్రజలు తీసుకొస్తున్నారని, వాటిని సొంత డబ్బుతో పరిష్కరించమని అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
సినిమా రంగంలో నటులు భారీ పారితోషికాలు అందుకుంటారు. వారికి ఉండే ప్రజాదరణ, స్టార్‌డమ్ తక్కువ కాలంలోనే కోట్లలో ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది. అదే సమయంలో, రాజకీయాలు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకు ఆదాయం కంటే ఖర్చులే అధికం. సినిమా స్టార్‌గా ఒక్క సినిమాకు కోట్లు తీసుకునేవారు, రాజకీయాల్లోకి వచ్చాక జీతం, అలవెన్సులు మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయి. ఇది వారి మునుపటి ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ. ప్రజాప్రతినిధి అయిన తర్వాత నియోజకవర్గంలో పర్యటనలు, కార్యకర్తలను, ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలను పరిష్కరించడానికి అయ్యే ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. నటులకు తెరపై ఉండే గ్లామర్, రాజకీయాల్లో కనిపించదు. ఇక్కడ నిజమైన ప్రజాసేవ, క్షేత్రస్థాయి కష్టాలు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. సినిమాలు, రాజకీయాలు రెండూ సమయాన్ని, శక్తిని డిమాండ్ చేస్తాయి. సినిమా పారితోషికం కోసం కొంత సమయం కేటాయించి, రాజకీయాలకు పూర్తి న్యాయం చేయలేకపోవడం, లేదా పూర్తిగా సినిమాలను వదులుకోలేకపోవడం వంటి సందిగ్ధత కూడా వారిలో ఆందోళన కలిగిస్తుంది.
సురేశ్ గోపీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖ నటుల వ్యాఖ్యలు… వెండితెర వెలుగులు, రాజకీయాల క్లిష్టత మధ్య ఉన్న ఆర్థిక, వాస్తవ వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజా జీవితంలో నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయాలంటే, ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉండే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో, తగినంత జీతం, అలవెన్సులు లేకపోవడం వల్ల నిస్వార్థ ప్రజాసేవకు అడ్డుగోడగా మారుతుందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. సినిమా రంగం నుంచి వచ్చిన సెలబ్రిటీలకు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోని ఈ ఖర్చుల తత్వం బోధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాదు, భారత రాజకీయాల్లో నిజాయితీగా పనిచేయాలనుకునే ప్రతి ప్రజాప్రతినిధి ఎదుర్కొనే సవాలుకు అద్దం పడుతోంది.