Congress : కాంగ్రెస్‌కు కాలం కలసి రావట్లేదా..?

దేశంలో ఒకప్పుడు తిరుగులేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోసం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ పార్టీకి అధికారం ఆమడదూరంలో నిలిచిపోతోంది. దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమైంది. వరుసగా మూడోసారి బీజేపీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గొప్పగా లేదు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కొన్ని చోట్ల ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నా కాంగ్రెస్ ఒంటరిగా నిలిచిన స్థానాలు తక్కువే. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది..?
2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోవడంతో ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీకి నిరాశే ఎదురవుతోంది. 2014లో ప్రధానిపీఠంపై కూర్చున్న మోదీ.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. బీజేపీ రోజురోజుకూ బలం పుంజుకుంటూనే వెళ్తోంది. 2019లో సొంతంగా మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ 2024 నాటికి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో బీజేపీ పనైపోయిందని.. ఇక కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అందరూ ఆశించారు. అయితే తాజాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో అది తప్పని నిరూపణ అయింది. ఝార్ఖండ్ లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయింది. మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
ఉపఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అయితే ఇవన్నీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలు లేదంటే తమ సీట్లే కావడం విశేషం. అంతేకానీ మరో పార్టీని ఓడించి పాగా వేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతోంది. ఒంటరిగా వెళ్తే ఉపయోగం ఉండట్లేదని భావించి మిత్రపక్షాలతో కలిసి వెళ్తోంది. అయినా ప్రయోజనం ఉండట్లేదు. ఈవీఎంల వల్లే తాము ఓడిపోతున్నామని ఇప్పుడు చెప్తోంది. అయితే గెలిస్తే ఈవీఎంలపై నెపాన్ని వేయకుండా.. ఓడినప్పుడు మాత్రమే ఇలా మాట్లాడడాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికో విధంగా తమ విధానాలను మార్చుకోవాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఒక సిద్ధాంతాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు దేశస్థాయిలో అదానీని రాహుల్ గాంధీని ఎండగడుతున్నారు. అదే సమంయలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. విపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. అంతేకాక మిత్రపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గి అణిగమణిగి ఉండాల్సి వస్తోంది. ఇది కూడా పార్టీ బలహీన పడడానికి మరో కారణం. మరోవైపు బీజేపీ ఎప్పటికప్పుడు నేషన్ ఫస్ట్ అనే నినాదంతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అంతర్గత సమీక్ష చేసుకోకుండా ఇలాగే ముందుకెళ్తే మున్ముందు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండొచ్చు.