Oman: ఇరాన్-అమెరికా అణుచర్చల్లో ముందడుగు..
అమెరికా బెదిరింపులో తెలియదు.. ఇరాన్ (Iran) ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించిందో అర్థం కాదు కానీ.. ఆ తూరుపు, ఈ పశ్చిమం చర్చలకు ఉపక్రమించాయి. అదీ కూడా అమెరికా కోరుతున్నట్లుగా అర్థవంతమైన అణుచర్చల దిశగా ముందడుగేశాయి. అయితే అమెరిాకా నేరుగా అణుచర్చలు చేద్దామంటే.. ముందుగా పరోక్ష చర్చలే కావాలని తెలిపింది ఇరాన్. కానీ .. ఒమన్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు కూర్చుని చర్చలు మొదలుపెట్టారు.
అణు’ చర్చల విషయంలో అమెరికా (USA), ఇరాన్‌లు ముందడుగేశాయి. ఇరుదేశాల ప్రతినిధులు శనివారం ఒమన్ వేదికగా సమావేశమయ్యారు. తొలివిడత చర్చలు ముగిశాయని, ఇరుపక్షాలు వచ్చే వారం మరిన్ని చర్చలు నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఒమన్ విదేశాంగ మంత్రి సమక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిలు క్లుప్తంగా మాట్లాడుకున్నారని తెలిపింది. దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్న వేళ.. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష సంభాషణ శాంతి ఆశలను చిగురిస్తోంది.
ఒమన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన చర్చలు.. సాయంత్రం 5.50 వరకు కొనసాగినట్లు సమాచారం. పరోక్ష చర్చలు ప్రారంభమైనట్లు ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ధ్రువీకరించారు. తమ దేశ ప్రయోజనాలు కాపాడుకోవడమే అత్యంత ముఖ్యమన్నారు. ఇదిలా ఉండగా.. న్యూక్లియర్ డీల్‌ను అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల స్పష్టం చేశారు. అదే జరిగితే ఎదురుదాడులకు వెనకాడబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సైతం తెలిపారు.
ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణుఒప్పందం నుంచి అగ్రరాజ్యం వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరాన్‌తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తొలి భేటీ జరిగింది.







