Chevireddy Mohith Reddy: విచారణకు గైర్‌హాజరు… ఎస్‌ఐటి అరెస్ట్‌కు సిద్ధం?

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌కు (AP Liquor Scam) సంబంధించి అరెస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పది మందికి పైగా అరెస్టయ్యారు. తాజాగా మరో ప్రముఖుడి పేరూ తెరపైకి వచ్చింది. చంద్రగిరి (Chandragiri) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy) కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన్ను ఈ కేసులో 39వ నిందితుడిగా నమోదు చేశారు.
మోహిత్ ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టు తో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లోనూ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఈ రెండింటిలోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. బెయిల్ తిరస్కరణతో, ఎప్పుడు అరెస్టవుతారోననే ఉత్కంఠకు గురయ్యారు. దీంతో, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సిట్ (S.I.T) అధికారులు పూర్తిగా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మోహిత్ రెడ్డికి విచారణకు హాజరయ్యేందుకు చాలాసార్లు నోటీసులు పంపారు. అయితే మోహిత్ మాత్రం కోర్టుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్ల ఫలితాలకే ఎదురుచూస్తానంటూ విచారణకు రావడం ఆలస్యం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మంగళవారం ఆయన విచారణకు రాకపోతే, ఎన్‌ఫోర్స్మెంట్ టీం నేరుగా అరెస్ట్‌కు దిగి పోవడం ఖాయం అంటున్నారు అధికారులు. మోహిత్ హాజరైనా కూడా విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చదువులో మోహిత్ మంచి ప్రతిభ కనబరిచారు. లండన్ (London)లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. సాధారణంగా అటువంటి విద్యార్థులు వృత్తిపరంగా మంచి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే పరిణామాలు మారిపోయాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భాస్కర్ రెడ్డి ఆశలు విస్తరించాయి. తన స్థానంలో కుమారుడిని బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల్లో తండ్రి, కుమారుడు ఇద్దరూ ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు మోహిత్ అరెస్టు అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే భాస్కరరెడ్డి సహా ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. మోహిత్‌తో పాటు మరొకరు పరారీలో ఉన్నారు. మంగళవారం ఆయన విచారణకు రాకపోతే, ఈ ఇద్దరిని పట్టుకోవడానికి అధికారులు భారీ స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేయబోతున్నారు. ఒక్కవేళ మోహిత్ చదువుకున్న రంగంలో కొనసాగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.