మిల్ పిటాస్ లో ఘనంగా ఇండియా ఇండిపెండెన్స్ డే వేడుకలు
బే ఏరియాలోని ఎన్నారై కమ్యూనిటీ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మిల్పిటాస్లో ఆగస్టు 6వ తేదీన ఘనంగా నిర్వహించింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ), దేశీ 1170 ఎఎం, బాలీ 92.3 ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 10,000మందికిపైగా కమ్యూనిటీకి చెందిన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దేశభక్తి స్ఫూర్తిని తెలియజేసేలా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. వినోద కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ మైమరపింపజేశాయి. సంజీవ్ గుప్తా సిపిఎ ఈ వేడుకను సమర్పించారు. ఉదయం 11 నుంచి రాత్రి 8వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఛోటా భీమ్, భల్లాల దేవ, హనుమాన్, బాల గణేష్, బాలకృష్ణ, స్పైడర్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి వేషధారణలతో చేసిన విన్యాసాలు చిన్నారులు, పెద్దలను ఆకట్టుకున్నాయి. జంగిల్‌బుక్, టీ కప్ రైడ్, రాక్వాల్, బుంగీ జంపింగ్, శక్తిమాన్ వంటివి చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులకోసం ఏర్పాటు చేసిన బొమ్మరైలు ప్రయాణాలు కూడా ఆకట్టుకున్నాయి. భారతీయ కళలను తెలియజేసేలా కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి శాస్త్రీయ సంగీత నృత్యరూపకాలతో బాలీవుడ్, టాలీవుడ్ డ్యాన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.
పీకాక్ రెస్టారెంట్, కేక్స్ అండ్ బేక్స్, షాలిమార్, కుకీస్, రసోయ్, పిస్తా హౌజ్, తిరుపతి భీమాస్, ఉలవచారు వంటివి ఈ వేడుకలకు ఆతిధ్యాన్ని అందించాయి. షాపింగ్ మాల్స్ గురించి చెప్పాల్సిన పనిలేకుండా దాదాపు 60 వెండర్లు తమ తమ స్టాల్స్‌లను ఏర్పాటు చేశారు. వేడుకల్లో నిర్వహించిన పోటీల్లో 5 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయస్సు ఉన్నవారంతా పాల్గొనడం విశేషం. యు స్మైల్ డెంటల్ వారు ఉచిత హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
శాన్ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా వెంకటేశన్ అశోక్, ఎపి అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, మిల్పిటాస్ మేయర్ జో ఎస్టీవ్, కమ్యూనిటీ నాయకుడు ఆర్.ఓ. ఖన్నా, శాన్‌హెసె కౌన్సిల్ మెంబర్ యాష్ ఖల్రా, కుపర్టినో సిటీ వైస్ మేయర్ సవితా వైద్యనాథన్, కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు కెన్సెన్ చు, ఫ్రీమాంట్ సిటీ వైస్ మేయర్ లిలి మే, సన్నివేల్ కౌన్సిల్ మెంబర్ తారా మార్టిన్ మిలియస్, సిలికాన్‌వ్యాలీలో ఉన్న బ్రహ్మకుమారీయులు సిస్టర్ సుసుమ్జీ, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా కె. వెంకట రమణ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), బే ఏరియా తమిళ మండ్రం (బిఎటిఎం), బీహార్ అసోసియేషన్, ఆశాజ్యోతి, గోపియో, ఇండియా లిటరసీ ప్రాజెక్టు, కాశ్మీరీ అసోసియేషన్, పంజాబీ కల్చరల్ అసోసియేషన్, రాజస్థాన్ అసోసియేషన్, స్పందన, ఆశాజ్యోతి, శంకర ఐ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టిసిఎ), ఉత్తర ప్రదేశ్ మండల్ (యుపిఎంఎ), వేద టెంపుల్ తదితర సంఘాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.













