YS Jagan: స్టాలిన్ మీంటింగ్‌కు జగన్ డుమ్మా..! చరిత్రాత్మక తప్పిదం చేశారా..!?

ప్రస్తుతం దేశంలో సౌత్ వర్సెస్ నార్త్ పోరాటం జరుగుతోంది. ఉత్తరాధి ఆధిపత్యం వల్ల దక్షిణాది నష్టపోతోందని ఈ ప్రాంత పార్టీలు గళమెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ (Stalin) గట్టి పోరాటమే చేస్తున్నారు. తనతో పాటు దక్షిణాది పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఉత్తరాదిపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం చెన్నైలో ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్లమెంటులో ప్రాతినిథ్యం కలిగిన అన్ని పార్టీలకూ ఆహ్వానాలు పంపించారు. దక్షిణాదికి చెందిన రాష్ట్రాల నుంచి పలు పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.
తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కర్నాటక నుంచి డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్, కేరళ నుంచి సీఎం పినరయి విజయన్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలూ పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పార్టీ కూడా ఈ భేటీకి హాజరు కాలేదు. టీడీపీ, జనసేన ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి అవి హాజరవుతాయని ఆశించలేం. పైగా ఇటీవల చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ భాషా సమస్య లేదన్నట్టు స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఈ భేటీకి హాజరవుతారా.. లేదా అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
అయితే ఈ భేటీకి జగన్ హాజరు కాలేదు. పైగా ప్రధాని మోదీకి నియోజకవర్గాల పునర్విభజనపై ఓ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందిని పేర్కొన్నారు. కేంద్రం జనాభా నియంత్రణకు పిలుపునివ్వడంతో గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని.. జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం తగ్గుతుందని లేఖలో తెలిపారు. అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇదే లేఖను ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డీఎంకే అధినేత స్టాలిన్ కు కూడా పంపినట్లు పార్టీ వెల్లడించింది.
వాస్తవానికి ఈ సమావేశానికి జగన్ వెళ్లాలని చాలా మంది కోరుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం కావడంతో హాజరైతే బాగుంటుందని ఆశించారు. ఎన్డీయేలో ఉన్నందున టీడీపీ, జనసేన హాజరయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు జగన్ రాష్ట్రం గురించి ఆలోచించి ఉంటే బాగుండేదని చెప్తున్నారు. కానీ జగన్ ఇప్పటికీ బీజేపీతోనే ఉంటున్నట్టు ఈ లేఖ ద్వారా అర్థమవుతోంది. మనసంతా ఇప్పటికే మోదీ చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని వినియోగించుకోకపోతే చరిత్రాత్మక తప్పులు చేసినట్లు భావించాలి. ఇప్పుడు జగన్ చేసింది కూడా అలాంటిదే.