Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ..14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ను హిస్సార్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన హరియాణాలోని కోర్టుకు ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు నాలుగు రోజుల పాటు జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది. గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల ప్రారంభంలో పంజాబ్ (Punjab), హరియాణా (Haryana), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh ) కు చెందిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో జ్యోతి కూడా ఒకరు. అయితే దర్యాప్తులో ఆమెకు పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించడంతో మొదటి ఐదు రోజుల పాటు పోలీస్ రిమాండ్‌కు పంపారు. అనంతరం మే 22న కోర్టు ముందు హాజరుపరిచారు. ఆమెను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరడంతో, వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు 4 రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించింది. కస్టడీ నేటితో ముగియడంతో మరోసారి కోర్టులో హాజరుపర్చగా ప్రస్తుతం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది.