Women Reservation: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు!

రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (Women Reservation) అమలు చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ (PM Modi) ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో డీలిమిటేషన్ ప్రక్రియకు గట్టి సంబంధం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్రం దేశవ్యాప్తంగా కొత్తగా జనాభా లెక్కలతోపాటు కులగణన నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ఈ గణన ప్రక్రియను 2026 అక్టోబర్‌లో మొదలుపెట్టేందుకు ప్రణాళిక రూపొందించగా, మిగతా దేశంలో 2027లో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్)పై చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. డీలిమిటేషన్ (Delimitation) అనంతరం 2029లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో, ఇప్పటికే 2023లో పార్లమెంట్ ఆమోదం పొందిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ లేదా మహిళా బిల్లులో పేర్కొన్న 33 శాతం రిజర్వేషన్‌ను (Women Reservation) అమలులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. జనాభా గణన పూర్తయిన తరువాతే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయగలమని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తోందని సమాచారం.