Delimitation: ఢీ లిమిటేషన్… విపక్షాలకు ఆయుధమేనా?

డీ లిమిటేషన్ ప్రతిపాదన దేశాన్ని కుదిపేస్తోంది. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ (Delimitation) తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా ఇది దక్షిణాది వర్సెస్ ఉత్తరాదిలా మారింది. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశామని.. తమకు ప్రోత్సాహం ఇవ్వకుంటే పోతేపోయింది కానీ.. ఎందుకీ శిక్షని ప్రశ్నిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు. జనాభాను నియంత్రించకుండా ఉండి, అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలకు ఇప్పుడు ఎంపీలు పెరుగుతారు. వారికి నిధుల కేటాయింపు పెరుగు తుంది. మరి మా సంగతేంటని నిగ్గదీస్తున్నాయి.
సాధారణంగా ప్రతీ 10 సంవత్సరాల జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. కానీ, పలు కారణాలతో కేంద్ర ప్రభుత్వం .. చాలా ఏళ్లుగా దేశంలో జనాభా లెక్కలను పూర్తి చేయలేక పోయింది. చివరి డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. చట్టం ప్రకారం తదుపరి డీలిమిటేషన్ 2021లో జరగాలి. 2025 లేదా 2026లో జనగణన జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన మనం ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి. ఒకటి జనాభా లెక్కలు. రెండోది నియోజకవర్గాల డీలిమిటేషన్. మూడోది మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ మూడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. రాబోయే సాధారణ ఎన్నికల్లోగా జనాభా లెక్కలు జరిగితే, 2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో పెను మార్పులను ఆశించవచ్చు. అసెంబ్లీలు, పార్లమెంట్‌లో మూడిరట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయడం జరుగుతుంది. మొత్తం దేశాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రతి రాష్ట్ర జనాభా ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్యను కేటాయించడం జరుగుతుంది. ఒక రాష్ట్రానికి, పార్లమెంటు సీట్ల సంఖ్య చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక రాష్ట్ర పార్లమెంట్ స్థానాలు జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్రం పాత్రను నిర్ణయిస్తాయి.
1976 వరకు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగానే జరిగింది. 1975లో తమిళనాడు, కేరళ వంటి వేగంగా అభివృద్ధి చెందిన, అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాలు ఎంపీ సీట్లను కోల్పోతున్నా యని, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వాటి జనాభా పెరుగుతున్నందున ఎక్కువ సీట్లు పొందుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడం మొదలైంది.
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ జనాభా నియంత్రణపై చాలా ఆసక్తి చూపారు. తమిళనాడు అభిప్రాయాలు సరైనవని, వారు తమ జనాభాను నియంత్రిస్తున్నందున వారిని కుటుంబ నియంత్రణ పేరిట శిక్షించకూడదని సంజయ్ గాంధీ ప్రభుత్వానికి సూచించారు. కాబట్టి చారిత్రాత్మక 42వ సవరణను రాజ్యాంగంలోకి తీసుకువచ్చారు, ఇది వివిధ రాష్ట్రాల ఎంపీల సంఖ్యను స్తంభింపజేస్తుందని పేర్కొంది. దీని అర్థం ఒక రాష్ట్రంలో డీలిమిటేషన్ జరుగుతుంది. కానీ, ప్రతి రాష్ట్రానికి ఎంపీల సంఖ్య 1971లో ఉన్నట్లే ఉంటుంది. తర్వాత 2001లో జనాభా లెక్కల తర్వాత మళ్లీ అదే సమస్య తలెత్తింది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కూడా 1976లో ఇందిరాగాంధీ చేసినట్లుగానే చేశారు. వాజ్పేయి 84వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చా రు, ఇది కూడా ఎంపీల సీట్లను స్తంభింపజేసింది. అప్పుడు డీఎంకే అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి కేంద్ర ప్రభుత్వంలో ఉంది.
డీలిమిటేషన్ వివాదాలు
ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్తగా జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేయడం తప్పనిసరి, ఎందుకంటే 84వ రాజ్యాంగ సవరణ 2026 నాటికి డీలిమిటేషన్ నిర్వహించాలని పేర్కొంది. ఇప్పుడు ప్రధానంగా నెలకొన్న వివాదం.. ఎంపీ సీట్ల సంఖ్యను స్తంభిం పజేస్తారా లేదా పెంచుతారా లేదా జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తారా? ఈ ప్రశ్నల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశాన్ని చాలా బలంగా లేవనెత్తారు.
దక్షిణాది పోరుబాట..
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రంపై పోరాడుతున్నారు. ఈ విషయంపై తాజాగా ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జరిగిన తీర్మానం ఆధారంగా ఈ లేఖలు రాశారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాకు వీటిని పంపారు.డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తోన్న దాడి. ఇది పార్లమెంట్‌లో మన హక్కులకు కోత పెట్టి, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. ఈ అన్యాయాన్ని మేం సహించబోం’’ అని స్టాలిన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 వద్ద ఉండి, జనాభా ప్రకారం సర్దుబాటు చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ స్థానాలను కోల్పోతాయి. మరోవైపు తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలు పెరగడంతో ఎంపీల సీట్లు పెరిగి ఎక్కువ లబ్ధి పొందుతాయి. ఒకవేళ లోక్‌సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి పెంచితే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎంపీలు లభిస్తారు.
ఏమిటీ డీలిమిటేషన్ వివాదం..?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తక్కువగా ఉండటంతో లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడుతుందన్న భయాలున్నాయి. కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే, వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియం త్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లు లాంటి రాష్ట్రాలు అధిక ప్రాధాన్యం పొందనున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం సాగించాలని తీర్మానం చేశారు. పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు.