Bihar Elections: బీహార్ ఎన్నికల్లో ‘పెళ్లిళ్ల పంచాయితీ’
బీహార్ అసెంబ్లీ (Bihar Assembly Elections) ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష మహాకూటమి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా ‘పెళ్లి’ అంశం ఇప్పుడు ఇరు పార్టీల మధ్య కొత్త పంచాయితీకి తెరలేపింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజా పకర్లో నిర్వహించిన సభలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. “పంచాయతీ ఎన్నికల దగ్గర్నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు.. ఎన్నిక ఏదైనా ప్రధాని మోడీ (PM Modi) బిజీబిజీగా ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బీహార్‌లో కూడా ‘కుమారుడి పెళ్లి’ అన్నట్లుగా తిరుగుతూనే ఉన్నారు. ప్రజలు ఎన్నిసార్లు కేవలం మోదీ ముఖాన్ని చూసి ఓట్లు వేస్తారు?” అంటూ ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ ప్రతి ఎన్నికనూ వ్యక్తిగతంగా తీసుకుని అతిగా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘బేటే కీ షాదీ’ వ్యాఖ్యల ద్వారా ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఖర్గే ప్రయత్నించారు.
మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఖర్గే వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. “ఖర్గేజీ, మీ కాంగ్రెస్ యువరాజు పెళ్లి ఎప్పుడైనా జరిగితే దయచేసి మమ్మల్ని పిలవండి. దానికి మేం కచ్చితంగా హాజరవుతాం” అని గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతలు తరచుగా రాహుల్ గాంధీని యువరాజు అని సంబోధిస్తూ ఉంటారు. తద్వారా కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎత్తి చూపుతుంటారు. ఇప్పుడు ఖర్గే ‘కుమారుడి పెళ్లి’ అంశాన్ని ప్రస్తావించగానే, దానికి గిరిరాజ్ సింగ్ అదే ‘పెళ్లి’ అంశంతో, రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకున్నారు.
ఈ ‘పెళ్లిళ్ల పంచాయితీ’తో పాటు అనేక అంశాలు ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే బీహార్‌లో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని మోడీ విమర్శించారు. మోడీ విమర్శలను ఖర్గే ఖండించారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చినా, బీజేపీ మాత్రం నితీష్ కుమార్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయదన్నారు. దీంతో ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోడీని ఎవరైనా ప్రశ్నించడానికి సాహసం చేస్తే, వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తారని ఖర్గే మండిపడ్డారు.
మొదటి దశ పోలింగ్‌కు ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగుస్తుంది. అభివృద్ధి, కుల సమీకరణాలు, పాలనాంశాల చుట్టూ తిరగాల్సిన రాజకీయ చర్చ, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, ‘పెళ్లి’ లాంటి పరోక్ష అంశాలపైకి మళ్లాయి. తొలి దశ పోలింగ్ నవంబర్ 6న జరగనుంది. మరి ఓటరు ఎవరివైపు నిలుస్తారో వేచి చూడాలి.







