Supreme Court: వక్ఫ్ చట్టంపై సమాధానం ఇచ్చేందుకు వారం గడువు కోరిన కేంద్రం

వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) దాఖలైన 72 పిటిషన్లపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌కు సంబంధించిన అంశాలపై సమగ్ర సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వారం గడువు కోరగా, న్యాయస్థానం ఆ డిమాండ్‌ను మన్నించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జరిగే వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై బుధవారం జరిగిన వాదనల్లో వక్ఫ్‌గా న్యాయస్థానాలచే గుర్తించబడిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుండి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) సూచన చేసింది. అంతేకాకుండా వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో పదవీరీత్యా సభ్యులు (ఎక్స్-అఫీషియో) మినహా మిగిలిన సభ్యులందరూ తప్పనిసరిగా ముస్లింలే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్-అఫీషియో సభ్యులను నియమించవచ్చని పేర్కొంటూ, వక్ఫ్ (సవరణ) చట్టంలోని కొన్ని ముఖ్యమైన నిబంధనలపై స్టే విధించేందుకు న్యాయస్థానం (Supreme Court) ప్రాథమికంగా ప్రతిపాదించింది.