Vijay: టీవీకే పార్టీ కీలక నిర్ణయం.. సీఎం అభ్యర్థిగా విజయ్

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళగ వెట్రి కళగం ( టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థి (CM candidate)గా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్ ను ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే వచ్చే నెలలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ విషపూరిత రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. బీజేపీతో చేతులు కలపడానికి తమ పార్టీ ఏమీ డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) కాదన్నారు. బీజేపీ (BJP) డీఎంకేలతో తమకు పొత్తులు ఉండబోవని తేల్చి చెప్పిన విజయ్, ఆ రెండు పార్టీలను తమకు సైద్ధాంతిక శత్రువులుగా పేర్కొన్నారు.