Prayagraj: కుంభమేళలో ట్రాఫిక్ నిబంధనలు మారాయి…

కుంభమేళాలో తొక్కిసలాట ఘటనతో యూపీ సర్కార్(Uttarpradesh government) అప్రమత్తమైంది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం నిబంధనలకు సంబంధించిన మార్పులను ప్రభుత్వం ప్రకటించింది.వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది. (Kumbh Mela Stampede)
కుంభమేళాలో కీలక మార్పులు..
భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’(No vehicle Zone)గా ప్రకటించింది.వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్‌రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది.భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్-వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది.మేళా ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భక్తులు ఎక్కడా ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.
మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్‌వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 1, 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన ఘాట్‌కు వెళ్లేందుకు అఖాడా మార్గ్‌వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.