ట్విటర్ కు ఫైనల్ వార్నింగ్… తక్షణమే నియమించాలి

సోషల్ మీడియా సంస్థ ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. ట్విటర్‍కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలను కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐటీకి చెందిన సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
కొత్త మధ్యవర్తిత్వ మార్గదర్శక నిబంధనలు గత నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు వీటిని అంగీకరించడానికి సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. అయితే ట్విటర్ మాత్రం వీటికి ఇంకా అంగీకరించలేదు. ఇండియాలో చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ గ్రీవియెన్స్ ఆఫీసర్లను ట్విటర్ ఇంకా నియమించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ ఖాతాకు బ్లూటిక్ తొలగింపు వివాదం తరువాత తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం, ట్విటర్ వార్ మరింత ముదురుతోంది.