IRCTC: టికెట్ రిజర్వేషన్లలో ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధన

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు టికెట్ రిజర్వేషన్ నిబంధనలలో కీలక మార్పును తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుండి ఆన్‌లైన్ జనరల్ రిజర్వేషన్ విండో తెరిచిన మొదటి 15 నిమిషాలు ఆధార్‌తో లింక్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకునేలా నిబంధనలు మార్చింది. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌లకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉంది. దీన్ని సాధారణ రిజర్వేషన్‌లకు కూడా వర్తింపజేయనున్నారు. ఈ మార్పుల వల్ల అక్రమ సాఫ్ట్‌వేర్ల ద్వారా జరిగే టిక్కెట్ల బుకింగ్‌ను నివారించి, నిజమైన ప్రయాణికులకు సులభంగా టిక్కెట్లు లభించేలా చూస్తామని ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది. అయితే రైల్వే కౌంటర్ల వద్ద టిక్కెట్లు బుక్ చేసుకునే వారిపై ఈ కొత్త నిబంధన ప్రభావం చూపదని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ సదుపాయం అలాగే కొనసాగనుంది. ఈ నిర్ణయం ద్వారా సాధారణ ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని ఐఆర్‌సీటీసీ (IRCTC) లక్ష్యంగా పెట్టుకుంది.