CJI: న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు!

భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (CJI BR Gavai) టెక్నాలజీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో సాంకేతిక సాధనాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మానవ అనుభవాన్ని పూర్తిగా టెక్నాలజీతో భర్తీ చేసేందుకు ప్రయత్నించకూడదని హెచ్చరించారు. న్యాయ నిర్ణయాల్లో మానవీయ విజ్ఞానానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధస్సును (AI) నమ్మడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS) నిర్వహించిన ‘భారత న్యాయవ్యవస్థలో టెక్నాలజీ పాత్ర’ అనే సదస్సులో ఆయన (CJI BR Gavai) ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో వర్చువల్ కోర్టులు, ఆటోమేటెడ్ కాజ్ లిస్ట్‌లు, డిజిటల్ సదుపాయాలు వంటి ఆధునిక పరిజ్ఞానం ప్రవేశించడం అభినందనీయమేనని పేర్కొన్న గవాయ్.. అయితే ఈ పరిణామాల్లో మానవ పర్యవేక్షణ, నైతిక నియంత్రణలు తప్పనిసరి అన్నారు.
‘‘న్యాయాన్ని టెక్నాలజీ ప్రభావితం చేయకూడదు. మానవ సంబంధాలు, సామాజిక అంతరాలు, విలువలు – ఇవన్నీ కేవలం అల్గారిథంలకు అందని అంశాలు. న్యాయం అందించడానికి ఈ విలువలే ఆధారం కావాలి’’ అని ఆయన (CJI BR Gavai) పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు సాధనాలు న్యాయపరంగా కొన్ని విధుల్ని వేగవంతం చేయగలిగినప్పటికీ, అల్గారిథమిక్ పక్షపాతం, డేటా గోప్యత ఉల్లంఘన, తప్పుడు విశ్లేషణల ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని గవాయ్ సూచించారు. ‘‘ఎక్కడైనా మనిషి జాగ్రత్త తగ్గితే, ఏఐ ద్వారా తార్కికంగా తప్పుదోవ పట్టించే నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇటీవల కొన్ని ఘటనలు ఇలా జరిగాయి కూడా’’ అని ఆయన (CJI BR Gavai) చెప్పారు.